మలయాళం, తమిళం మాట్లాడేవారు విదేశాల్లోనే ఎక్కువ

మలయాళం, తమిళం మాట్లాడేవారు విదేశాల్లోనే ఎక్కువ
దాదాపు అన్ని భారతీయ భాషలను మాట్లాడే ప్రజల సంఖ్య తమ తమ రాష్ట్రాలలో అధికారంగా ఉంటుంది. అయితే, విదేశాలలో ఆ భాష మాట్లాడే వారి సంఖ్యకన్నా మనదేశంలోని ఇతర రాష్టాలలో ఆ భాష మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే, మలయాళం, తమిళం భాషలు అందుకు భిన్నమని ఓ అధ్యయనం తెలిపింది. ఆ భాషను మాట్లాడే వారి సంఖ్య మన దేశంలోని ఇతర రాష్ట్రాలలో కన్నా ఎక్కువ మంది విదేశాలలో ఉన్నట్లు వెల్లడైంది. 
 
ఏదైనా భాషను మాట్లాడేవారు అధికంగా ఉండే రాష్ట్రంలో మినహా దేశంలోని ఇతర రాష్ర్టాల్లో, విదేశాల్లో ఆ భాషను మాట్లాడేవారి సంఖ్యను తెలుసుకునేందుకు ఓ అధ్యయనం జరిగింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌కు చెందిన ఫ్యాకల్టీ మెంబర్‌ చిన్మయ్‌ టుంబే 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 
 
మన దేశంలోని రాష్ర్టాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాషను ప్రధానంగా మాట్లాడతారు. ఆ భాషను ఆ రాష్ట్రంలో మినహా ఇతర రాష్ర్టాల్లో మాట్లాడేవారిని ఇంటర్నల్‌ లేదా డొమెస్టిక్‌ డయాస్పొరా అని, ఇతర దేశాల్లో ఆ భాషను మాట్లాడేవారిని ఇంటర్నేషనల్‌ డయాస్పొరా అని పేర్కొన్నారు. 
 
మలయాళం, తమిళం మినహా మిగతా ప్రధాన భారతీయ భాషలను మాట్లాడే ఇంటర్నల్‌ డయాస్పొరా ఇంటర్నేషనల్‌ డయాస్పొరా కన్నా ఎక్కువగా ఉన్నారు. సోషియలాజికల్‌ బులెటిన్‌ జర్నల్‌లో ఈ నివేదిక ప్రచురితమైంది. మలయాళీలు భారత దేశం వెలుపల విదేశాల్లో 30 లక్షల మంది నివసిస్తుండగా, మన దేశంలోని కేరళ మినహా ఇతర రాష్ర్టాల్లో నివసిస్తున్నవారు కేవలం 16 లక్షల మంది మాత్రమే. 
 
తమిళులు విదేశాల్లో 45 లక్షల మంది నివసిస్తుండగా, తమిళనాడు మినహా మన దేశంలోని ఇతర రాష్ర్టాల్లో 39 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు. మిగిలిన భాషలను మాట్లాడేవారు మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో తక్కువగా ఉన్నారు. పంజాబీల మొత్తం జనాభాలో దాదాపు 12.4 శాతం మంది 2010లో అత్యధికంగా విస్తరించిన భాషా జన సమూహంగా నిలిచారు. 
 
ఆ తర్వాతి స్థానంలో మలయాళీలు 12.2 శాతం మంది, మూడో స్థానంలో తమిళులు 11.5 శాతం మంది ఉన్నారు. నాలుగో స్థానంలో ఉన్న తెలుగువారు 9.7 శాతం మంది కాగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గుజరాతీ (8.7 శాతం మంది), హిందీ (7.5 శాతం మంది), మరాఠీ (6.6 శాతం మంది), కన్నడం (4.6 శాతం మంది), బెంగాలీ మాట్లాడేవారు (3.7 శాతం మంది) ఉన్నారు.