తుంగభద్ర డ్యాంకు మరో ముప్పు

తుంగభద్ర డ్యాంకు మరో ముప్పు

ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకల ఉమ్మడి నీటి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాంకు మరో ముప్పు ముంచుకొచ్చింది.  ఈ జలాశయానికి ఉన్న మొత్తం 33 గేట్లలో ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక లోపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇంజినీర్లు వెల్లడించిన వివరాల ప్రకారం ఇంకా ఏడు గేట్లు పనిచేయకపోవడం వల్ల జలాశయం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.గ

తుంగభద్ర ఆనకట్టలోని 19వ నంబర్ గేటుకు ఇటీవల మరమ్మతులు చేశారు. అయినప్పటికీ ఈ గేటు గత ఏడాది ఆగస్టు 10న వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుండి తాత్కాలిక స్టాప్‌-లాగ్‌ గేట్‌ను ఏర్పాటు చేసి, పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడిది లీక్‌ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గడగ్‌ సమీపంలోని అడవి సోమాపుర వద్ద గల ఈ 19వ నంబరు గేటు స్థానంలో 49 టన్నుల కొత్త స్టీల్‌ గేట్‌ను తయారు చేసి,  జూన్‌ 2025 చివరిలో ఆ ప్రదేశానికి తీసుకువచ్చారు.

అయితే ప్రస్తుత వర్షాకాలంలో నీటి మట్టాలు ఎక్కువగా ఉండటం వల్ల, ఈ గేట్‌ను ఇన్‌స్టలేషన్‌ చేసే ప్రక్రియ ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా పడింది.  ఇంతలో మరో ఆరు క్రెస్ట్‌ గేట్లు వాటి నిర్మాణ బలాన్ని 90 శాతం వరకు కోల్పోయాయి. ఈ 33 గేట్లలో 18 గేట్లను అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అధికారులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి అన్ని గేట్ల నిర్మాణ, మరమ్మతు పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. 

వరదనీటి కారణంగా డ్యాంకి అమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నంబర్ల క్రస్ట్‌ గేట్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ గేట్లు నాలుగు అడుగులు మేర తెరిచి ఉంచారు. డ్యాంకు వరద పెరుగుతుండటంతో ఎక్కువ నీటిని వదిలేందుకు ఈ క్రస్ట్‌ గేట్లు మరింత ఎత్తు పెంచేందుకు వీలు కావడం లేదు.  మరోవైపు ఈ గేట్లు వరద ఉధృతికి కిందిభాగంలో వంగిపోయాయి. దీనిపై డ్యాం సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చిందని కర్నాటక మంత్రి శివరాజ్‌ తంగడిగి తెలిపారు. ప్రభుత్వం కొత్త గేట్ల తయారీకి రూ.60 కోట్లతో టెండర్‌ పిలిచింది.

భద్రతను దృష్టిలో ఉంచుకుని 80 టీఎంసీలకి మించి డ్యాంలో నీటిని నిల్వ ఉంచకూడదని అధికారులు నిర్ఘయించారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్రాజెక్టు నుంచి 135 టీఎంసీల నీరు కిందకు వదిలారు. అలాగే 24 టీఎంసీల నీటిని వినియోగించారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 23,295 క్యూసెక్కు లు వస్తోంది. ఔట్‌ ఫ్లో 23,193 క్యూసెక్కులుగా ఉంది. ఈ గేట్లు దెబ్బతినడంతో పరీవాహక ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది.