
బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో తొలగించామని చెప్పిన 65 లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం ఎస్ఐ ఆర్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి, సూర్యకాంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది.
తొలగించిన ఓటర్ల జాబితాను బూత్ ల వారీగా జిల్లా ఎన్నికల అధికారుల వెబ్ సైట్ లో ఆగస్టు 19 సాయంత్రం 5 గంటలలోపు పోస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే బూత్-స్థాయి అధికారులు, బ్లాక్ డెవలప్‌మెంట్/పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులలో కూడా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి. బీహార్ ఎన్నికల అధికారి వెబ్ సైట్ లో పోస్ట్ చేయడానికి తొలగించిన ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలను పొందాలి. వీటిని ప్రాంతీయ, ఆంగ్ల వార్తా పత్రికలలోనూ ప్రచురించాలి. రేడియో, టీవీ వీటితోపాటు ఎన్నికల సంఘం సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ ద్వారా కూడా విస్తృతమైన ప్రచారం కల్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది.
పబ్లిక్ నోటీసులో బాధిత వ్యక్తులు తమన నివాసమున్న అడ్రస్ తో ఆధార్ ఉంటుంది కనుక ఆధార్ కాపీతో అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం ఉందని సుప్రీం సూచించింది. ఇపిఐసి నెంబర్తో వెబ్ సైట్ లో శోధించేవిధంగా ఓటరు జాబితా పోస్టు చేయాలని, లేకపోతే దానికి గల కారణాలను సైట్ లో ఉండేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా రాజకీయ ద్వేషపూరిత వాతావరణంలో పని చేస్తున్నప్పటికీ వివాదాస్పదం కానీ నిర్ణయం ఏదీ లేదని ఈసీ పేర్కొంది. రాజకీయ పార్టీల మధ్య సంఘర్షణలో చిక్కుకున్నామని, వారు గెలిస్తే ఎంవీఎంలు మంచివని అంటారని, లేకపోతే నిందలు వేస్తారని ఆరోపించింది.
దీనికి న్యాయస్థానం స్పందిస్తూ పౌరుల హక్కులు రాజకీయ పార్టీల కార్యకర్తలపై ఆధారపడి ఉండకూడదని తాము కోరుకుంటున్నామని పేర్కొంది. డిస్‌ప్లే బోర్డులు, వెబ్‌సైట్‌లో పేర్లను ప్రదర్శించడం వల్ల అనుకోకుండా జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని.. ఈ విషయంలో సదరు ఓటర్ల కోసం పబ్లిక్ నోటీసు జారీ చేసే విషయాన్న పరిశీలించాలని ఈసీకి సూచించింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్