బీసీ రేజర్వేషన్లపై చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి

బీసీ రేజర్వేషన్లపై చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎంత చేయాలో అంతా చేశామని, ఇక ఇంతకుమించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించడమా? లేదంటే పాత ప్రభుత్వం పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లడమా? అనేదే మన ముందున్న తక్షణ కర్తవ్యం అని ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో అన్నట్టు తెలిసింది. 

గత, సోమవారం ఇద్దరి మధ్య గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలి? జనహిత పాదయాత్రలో ఎట్లా ముందుకు నడవాలి? అనే అంశాల మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్రంలో మనం చేసిన ప్రయత్నాలకు ఢిల్లీలో ఇటు మన వాళ్లు (కాంగ్రెస్‌ పార్టీ) కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదని నిరాశ వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కనీసం జంతర్‌ మంతర్‌ సభకు కూడా రాకపోవడం అతి పెద్ద పరాజయం అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. ‘ఇంటోడే ఈకతోటి కొట్టినంక బయటోడు తోకతోటి కొట్టడా?’ అని అన్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకుందామంటే, అది కూడా బూమరాంగే అయిందని, మనం చేతులు ఎత్తేయడం మినహా ఇక మన వద్ద ఎటువంటి అస్ర్తాలు లేవని అన్నట్లు తెలిసింది.

తుది ప్రయత్నంగా ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ పీఏసీ సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తాము చేసిన ప్రయత్నాలన్నీ పీఏసీ సమావేశంలో వివరించి మెజారిటీ నాయకుల అభిప్రాయాలతో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.

అర్ధాంతరంగా పెట్టిన జనహిత పాదయాత్ర తలనొప్పిగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘ఆమె ఎందుకు పెట్టిందో.. ఎవరిని అడిగి పెట్టిందో నీకైనా తెలుసా.. అన్నా?’ అంటూ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎం అడిగినట్టు సమాచారం.

‘పటాన్‌చెరులోని సిగాచి కెమికల్‌ పరిశ్రమ సంఘటన వద్దకు ఆమె (మీనాక్షి నటరాజన్‌) ఎందుకు వెళ్లినట్టు, మీరు వెంట ఉన్నారు కదా.. మీకేమైనా చెప్పిందా?’ అని మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అడిగినట్టు తెలిసింది. ‘నేను పరిశీలించి, ప్రకటన చేసిన తరువాత ఆమె వెళ్లడం దేనికి సంకేతం? రాష్ట్రంలో ఆమె సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నదా?’ అని పీసీసీ చీఫ్‌ వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.