పాక్‌ నేతలు, అధికారుల ప్రేలాపనలపై భారత్ ఆగ్రహం

పాక్‌ నేతలు, అధికారుల ప్రేలాపనలపై భారత్ ఆగ్రహం
భారత్‌పై విషం కక్కుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్న పాకిస్తాన్‌కు చెందిన నేతలు, అధికారుల పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి దుస్సాహసానికి దిగినా హానికర పరిణామాలుంటాయని విదేశాంగ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు, వైఫల్యాలను దాచేందుకు భారత్‌పై విషం చిమ్మడం పాకిస్తాన్‌కు అలవాటేనంటూ మంత్రిత్వశాఖ ఘాటుగా స్పందించింది. 
 
పాకిస్తాన్ యుద్ధోన్మాద, ద్వేషపూరిత వ్యాఖ్యలు కొత్తవేం కాదని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్ పేర్కొన్నారు. వారి పద్ధతి ఇదేనని, ఈ విధానంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటారని విమర్శించారు. ఇటీవల జరిగినట్లుగా మళ్లీ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. సింధు నది జలాల అంశంపై ఇటీవల పాక్‌ నేతలతో పాటు సైన్యాధిపతి మునీర్‌ అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశం వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని చెప్పారు. భారతదేశం కాల్పుల విరమణ, బందీలను బేషరతుగా విడుదల చేయాలని, గాజాకు నిరంతరాయంగా మానవతా సహాయం సరఫరా కోసం మద్దతు తెలుపుతుందని తెలిపారు. రెండుదేశాల ప్రజలు, శాంతి, భద్రతతో జీవించగలిగేలా భారత్‌ రెండుదేశాల మధ్య సమస్యల పరిష్కారానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ప్రధాని 

నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరువుతారా? లేదా? అన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జైస్వాల్‌ తెలిపారు. ఈ నెలలో రష్యాలోని మాస్కోలో జరగనున్న ఇండియా-రష్యా ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొంటారని, వాణిజ్యం, ఆర్థిక, సాంస్కృతిక సహకారంపై చర్చిస్తారని చెప్పారు.

భారతదేశం-అమెరికా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం గురించి జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశం-అమెరికా రక్షణ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య సంబంధానికి ఒక కీలమైన స్తంభమని, అమెరికా రక్షణ విధాన బృందం ఆగస్టు మధ్యలో ఢిల్లీకి వస్తుందని తెలిపారు. ఈ నెలలో రెండు దేశాల మధ్య ‘యుధ్ అభ్యాస్’ అనే సైనిక వ్యాయామం జరుగుతుందని, అలాగే, ఈ నెలాఖరులో 2 + 2 ఇంటర్-సెషనల్ సమావేశం కూడా ప్రతిపాదించినట్లు చెప్పారు. 

రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంటూ డాలర్‌పై మాట్లాడుతూ ఈ అంశంపై ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశామని తెలిపారు. డాలర్-డిమోనిటైజేషన్ భారతదేశ ఆర్థిక ఎజెండాలో భాగం కాదని స్పష్టం చేశారు. భారతదేశం-చైనా సరిహద్దుచ వాణిజ్యంపై తన వైఖరిని స్పష్టం చేసింది.  ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్, హిమాచల్ ప్రదేశ్‌లోని షిప్కి లా పాస్, సిక్కింలోని నాథూ లా పాస్ వంటి వాణిజ్య పాయింట్ల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంలో సహాయం చేయడానికి చైనా వైపు నుంచి సంప్రదింపులు కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు.