17న ధర్మస్థలికి బిజెపి ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలు 

17న ధర్మస్థలికి బిజెపి ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలు 
 
* తవ్వకాలలో కనిపించని సామూహిక ఖననం ఆధారాలు
 
సామూహిక ఖననం కేసుపై సిట్ దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలో, ఆదివారం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మశాల ఆలయ పట్టణాన్ని తమ శాసనసభ్యులు సందర్శిస్తారని బిజెపి ప్రకటించింది. మంజునాథ స్వామి, అన్నప్ప స్వామికి పూజలు చేయడమే తమ ఉద్దేశమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి వై విజయేంద్ర తెలిపారు. “మా సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ ఆదివారం ధర్మస్థలాన్ని సందర్శిస్తారు. మేము మంజునాథ స్వామి ఆశీస్సులు తీసుకుంటాము” అని విజయేంద్ర ప్రకటించారు. 
 
సందర్శనకు గల కారణం గురించి అడిగినప్పుడు, విజయేంద్ర, “మేము కొనసాగుతున్న దర్యాప్తులో ఎటువంటి జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయడం లేదు. మేము బిజెపి నాయకులుగా కాకుండా, మంజునాథ స్వామి భక్తులుగా అక్కడికి వెళ్తున్నాము” అని చెప్పారు. “నిజం బయటపడాలి,  గందరగోళం త్వరలో ముగియాలి. దర్యాప్తు వెనుక ఎస్డీపీఐ వంటి సామాజిక వ్యతిరేక శక్తులు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి” అని తెలిపారు. 
 
“ధర్మస్థలంలోని కొన్ని ప్రాంతాల్లో యువతులు, బాలికలతో సహా అనేక మందిని ఖననం చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష బిజెపి కర్ణాటక అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తింది” అని చెప్పారు.   “ధర్మస్థల సామూహిక ఖననం కేసుపై సిట్ దర్యాప్తుపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. కొన్ని శక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపిస్తూ, ధర్మస్థల మత పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు” అని వివరించారు.
 
కాగా, సుమారు 200 కారులలో బిజెపి ఎమ్యెల్యేలు, ఎమేల్సిలు  ధర్మస్థలికి వెడుతున్నట్టు తెలుస్తున్నది. . కాగా, ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ దీంతో సిట్‌ దర్యాప్తునకు ఆదేశించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వైఖరి మార్చుకున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.  దర్యాప్తులో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని ఇటీవల కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సిద్ధరామయ్య చెప్పారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు, ధర్మస్థలలో తవ్వకాలకు ఆదేశించింది మీరే కదా? అని సీఎం సిద్ధరామయ్యను కేంద్ర మంత్రి ప్రశ్నించారు.  “కేవలం మట్టిని మాత్రమే తవ్వారు. ఎటువంటి ఆధారాలు లేదా మానవ అవశేషాలు లభించలేదు. ఇప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటానికి, తన ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని సీఎం చెబుతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు” అని జోషి విమర్శించారు. ప్రజల విశ్వాసంతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని ఆరోపించారు.
 
అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా బిజెపికి చెందిన మాజీ మంత్రి వి. సునీల్ కుమార్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ, దర్యాప్తు సాకుతో సోషల్ మీడియాలో ఒక ప్రముఖ హిందూ మత కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
“ధర్మస్థలం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న దర్యాప్తును నేను స్వాగతిస్తున్నాను. కానీ దర్యాప్తును సాకుగా ఉపయోగించి, హిందూ మత కేంద్రాలను అపహాస్యం చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా పోస్టులు, ప్రకటనలలో, ధర్మస్థలాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మా విశ్వాసం, నమ్మకాలపై ప్రభావం చూపింది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
స్థానిక పోలీసులు తగినంత సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, వామపక్ష సమూహాల డిమాండ్ల కారణంగా సిట్ ఏర్పడిందని దక్షిణ కన్నడ జిల్లా మంత్రి దినేష్ గుండూరావు చేసిన ప్రకటనను ఈ సందర్భంగా బిజెపి సీనియర్ శాసనసభ్యుడు ఎస్. సురేష్ కుమార్ గుర్తు చేశారు. 

మరోవంక, కర్ణాటకలోని ధర్మస్థల 13వ ప్రాంతంలో సిట్‌ రెండు రోజుల పాటు జరిపిన తవ్వకాలలో ఎలాంటి మానవ అవశేషాలు బయటపడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తవ్వకాలను బుధవారం ముగించారు. ధర్మస్థలంలోని 13వ అనుమానిత శ్మశాన వాటికలో వందలాది మృతదేహాలను ఖననం చేసినట్లు ఆరోపణలు చెలరేగడంతో ఈ తవ్వకాలను ప్రారంభించారు. 

దీంతో ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు అక్కడ జీపీఆర్‌ స్కానింగ్‌ నిర్వహించారు. జాతీయ మానవ హక్కుల సంఘం బృందం, సాక్షులు, ఇతర అధికారుల పర్యవేక్షణలో అక్కడ తవ్వకాలు జరిపారు. కాగా, నేత్రావతి-అజికూరి రహదారి వెంబడి కింది ఆనకట్ట సమీపంలో సిట్‌ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. 32 అడుగుల లోతు, 25 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు గల భారీ గొయ్యిని తవ్వారు. 

అయితే అస్థిపంజరాలు లేదా మానవ ఖననాలకు సంబంధించిన అవశేషాలు, ఆధారాలు ఏవీ లభించలేదని అధికారులు నిర్ధారించారు. దీంతో బుధవారం సాయంత్రానికి తవ్వకం పనులు ముగించారు. తవ్విన భారీ గుంతను తిరిగి మట్టితో పూడ్చివేశారు. మరోవైపు సాక్షులు ఆరోపించిన 16 ప్రదేశాలలో ఇప్పటి వరకు రెండు ప్రాంతాల్లో మాత్రమే మానవ అవశేషాలు లభించాయి. ఒక్క చోట మాత్రమే ఓ పురుష అస్థిపంజరం కనిపించింది. అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా అవశేషాల కోసం పరిశీలన కొనసాగుతుందని సిట్‌ అధికారులు వెల్లడించారు.