యోగిని పొగిడిన ఎమ్యెల్యే పూజను బహిష్కరించిన అఖిలేష్

యోగిని పొగిడిన ఎమ్యెల్యే పూజను బహిష్కరించిన అఖిలేష్
 * తన భర్త హంతకుడిని చంపి న్యాయం చేశారని అసెంబ్లీలో ప్రశంస!

తన భర్త రాజు పాల్ హత్య వెనుక ఉన్న దోషులకు చంపి తనకు న్యాయం చేశారని అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించిన కొన్ని గంటలకే అఖిలేష్ యాదవ్ తన ఎమ్మెల్యే పూజా పాల్‌ను సమాజ్‌వాదీ పార్టీ నుండి బహిష్కరించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ సంతకం చేసిన పత్రంను విడుదల చేస్తూ ఓ నేత పాల్ గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలిందని, పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని, ఆమెను బహిష్కరించినట్లు తెలిపారు. 

శాంతిభద్రతల విషయంలో రాజీలేని వైఖరి అవలంభిస్తున్నారని కొనియాడుతూ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌పై స‌మాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ గురువారం ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న భ‌ర్త‌ను చంపిన గ్యాంగ్‌స్ట‌ర్ అతిక్ అహ్మ‌ద్‌ను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మ‌ట్టుబెట్టార‌ని పేర్కొంటూ అందుకు ఆమె అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

సీఎం యోగి న్యాయం అందించార‌ని, త‌న వేద‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోకున్నా ఆయ‌న స్పందించార‌ని, రాష్ట్ర రాజ‌కీయాల్లో జీరో టాలరెన్స్ తీసుకువ‌చ్చారని అంటూ ఆమె ప్రశంసించారు.  విజ‌న్ డాక్యుమెంట్ 2047పై ప్రసంగిస్తూ ఆమె ఈ వాఖ్యలు చేశారు.  త‌న భ‌ర్త రాజ్ పాల్‌ను ఎవ‌రు హత్య కావించారో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసని పేర్కొంటూ త‌న‌కు న్యాయం చేసిన సీఎంకు ధ‌న్య‌వాదులు చెబుతున్న‌ట్లు ఆమె చెప్పారు. 
 
అతిక్ అహ్మ‌ద్ లాంటి నేరస్తుల‌ను చంపి ప్ర‌యాగ్‌రాజ్‌లోని త‌న లాంటి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ముఖ్యమంత్రి న్యాయం చేశార‌ని ఎమ్మెల్యే పూజా పాల్ తెలిపారు. బీఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజు పాల్‌ను 2005, జ‌న‌వ‌రి 25వ తేదీన హ‌త్య చేశారు. పూజా పాల్‌ను పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల‌కే ఆ హత్యా జ‌రిగింది.
 
“నేడు రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపు నమ్మకంగా చూస్తోంది. నా భర్త హంతకుడైన అతిక్ అహ్మద్‌ను ముఖ్యమంత్రి న్యాయస్థానం ముందు నిలబెట్టారు. ఆయనలాంటి నేరస్థులను ఎవరూ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం చూసి నేను గొంతు పెంచాను. ఈ పోరాటంలో నేను బలం కోల్పోవడం ప్రారంభించినప్పుడు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాకు న్యాయం చేశారు” అని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

గ్యాంగ్‌స్ట‌ర్ అతిక్ అహ్మ‌ద్ సోద‌రుడు అష్ర‌ఫ్‌తో ఉన్న రాజ‌కీయ విబేధాల వల్ల హ‌త్య జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌యాగ్‌రాజ్ వెస్ట్ సీటు నుంచి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అష్ర‌ఫ్‌ను రాజు ఓడించారు. దీంతో రాజును హ‌తమార్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ హత్యా కేసులో కీల‌క సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను ఫిబ్ర‌వ‌రి 2023లో హత్య చేశారు. ఓ కేసులో అతిక్‌, అష్ర‌ఫ్‌ను అరెస్టు చేశారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో మెడిక‌ల్ చెక‌ప్‌కు తీసుకెళ్తున్న స‌మ‌యంలో ఆ ఇద్ద‌రిపై దాడి జ‌రిగింది. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతిక్‌ను కాల్చేశారు. అష్ర‌ఫ్‌ను కూడా ఆ స్పాట్‌లోనే హత్య చేశారు. అతిక్ కుమారుడు అస‌ద్‌ను కూడా ఝాన్సీలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో చంపేశారు. మాజీ ఎమ్మెల్యే రాజు హత్య కేసును 2016లో సీబీఐ విచారించింది.