జమ్ము కశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌.. 38 మంది భక్తులు మృతి

జమ్ము కశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌.. 38 మంది భక్తులు మృతి

జమ్ము కశ్మీర్‌ లో క్లౌడ్‌బరస్ట్‌ చోటు చేసుకుంది. దీంతో కిష్త్వార్‌ లోని చోసిటీలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలకు 38 మంది భక్తులు వరద ప్రవాహంలో చిక్కుకుని మరణించారు. మరో 79 మంది గాయపడగా వారిని ఆసుపత్రులలో చేర్పించారు. స్థానిక మాచైల్‌ మాతా మందిరానికి వెళ్లే యాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది. మాచైల్‌ మాతా దర్శనం కోసం వెళ్లే క్రమంలో నది దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

ప్రమాద సమయంలో చాలా మంది భక్తులు అక్కడ ఉన్నట్లు తెలిసింది. దీంతో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మాచైల్‌ మాతా యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.కిష్త్వార్‌లో కుంభవృష్టి,  వరదల వల్ల ప్రభావితమైన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఆలోచనలు, ప్రార్థనలను తెలియజేశారు.

పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. “జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో కుంభవృష్టి, వరదల వల్ల ప్రభావితమైన వారందరికీ నా ఆలోచనలు,ప్రార్థనలు ఉన్నాయి. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.  సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైన వారికి సాధ్యమైన ప్రతి సహాయం అందించబడుతుంది” అని ఎక్స్ లో భరోసా ఇచ్చారు. 

కిశ్త్‌వాడ్‌ మాచైల్‌ మాతా (చండీ) మందిరానికి వెళ్లే యాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది. మచైల్ మాతా యాత్ర కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడగా, గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్య చోసిటీని విపత్తు తాకింది. అక్కడి నుంచి పుణ్యక్షేత్రానికి 8.5 కి.మీ. నడక ప్రారంభమవుతుంది. అప్పటికే చేరుకున్న భక్తులను వెనక్కి పంపేశారు అధికారులు. కంట్రోల్ రూమ్-కమ్-హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ కోసం ఐదుగురు అధికారులను విధుల్లో నియమించారు.

క్లౌడ్ బరస్ట్ తర్వాత పరిస్థితి గురించి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. “జమ్మాకశ్మీర్​లో క్లౌడ్​ బరస్ట్​ గురించి అమిత్​షాతో మాట్లాడాను. క్లౌడ్ బరస్ట్ దెబ్బతిన్న ప్రాంతం నుంచి వస్తున్న వార్తలు భయంకరమైనవి. ధ్రువీకరించిన సమాచారం నెమ్మదిగా వస్తుంది. రక్షణ కార్యకలాపాలను నిర్వహించడానికి అధికారులు అన్ని వనరులను సమీకరిస్తున్నారు” అని సీఎం తెలిపారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా సమాచారాన్ని పంచుకుంటుందని చెప్పారు.

ఘటనపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ డిప్యూటీ కమిషనర్ కిష్త్వార్ పంకజ్ కుమార్ శర్మతో మాట్లాడినట్లు చెప్పారు. చోసిటీలో క్లౌడ్‌ బరస్ట్‌లో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొనే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగారని చెప్పారు.

క్లౌడ్ బరస్ట్​ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు. “చోసిటీలో జరిగిన మేఘాల విస్ఫోటనం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయ చర్యలను బలోపేతం చేయాలని, బాధితులకు సాధ్యమైన అన్ని సహాయం అందించాలని పౌర, పోలీసు, సైన్యం, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్  అధికారులను ఆదేశించా” అని ఆయన ఎక్స్​లో వెల్లడించారు.