
ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్ళ కాలంలో రూ.5.82 లక్షల కోట్ల మేర రుణాలను రద్దు చేశాయని రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2024-25లో ఇలా రద్దుచేసిన రుణాలు రూ.91,260కోట్లు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.1.15లక్షల కోట్లుగా వుందని మంత్రి తెలిపారు.
2020-21 సంవత్సరంలో అత్యధికంగా రూ.1.33 లక్షల కోట్లు రుణాలు రద్దు చేశారు. ఆ తర్వాత సంవత్సరం ఆ మొత్తం రూ.1.16లక్షల కోట్లకు తగ్గింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 2022-23లో రూ.127లక్షల కోట్లు రుణాలు రద్దయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రు.1.65 లక్షల కోట్లను రికవరీ చేసుకున్నాయి. మొత్తంగా రద్దు చేసిన రుణాలతో పోలిస్తే రికవరీ రేటు దాదాపు 28 శాతంగా వుందని మంత్రి వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానాల ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి కేటాయింపులు జరిపిన వాటితో సహా ఎన్‌పిఎలను బ్యాంకులు రద్దు చేస్తాయని మంత్రి తెలిపారు. ఇలాంటి రుణాల రద్దు చర్యల వల్ల రుణం తీసుకున్నవారికి ఎలాంటి లబ్ది చేకూరదని స్పష్టం చేశారు. రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లింపులు జరపాల్సి వుంటుందని చెప్పారు.
ఈ ఖాతాల్లో రికవరీ చర్యలను బ్యాంకులు కొనసాగిస్తాయని తెలిపారు. ఇలా రద్దు చేసిన రుణాలకు సంబంధించి రికవరీ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతూ వుంటుందని పేర్కొంటూ ఇందుకుగానూ వివిధ రకాలైన రికవరీ యంత్రాంగాలను ఉపయోగిస్తారని చెప్పారు. సివిల్ కోర్టుల్లో లేదా రుణాల రికవరీ ట్రిబ్యునళ్ళలో కేసు వేయడం, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలు చేయడం తదితర రకాలు వుంటాయని కేంద్ర మంత్రి వివరించారు.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి