ఈ20 ఇంధనంతో మైలేజ్‌ పై దుష్ప్రచారం!

ఈ20 ఇంధనంతో మైలేజ్‌ పై దుష్ప్రచారం!

ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ వినియోగం (ఈ20) ఇంధనం ఉపయోగిస్తే మైలేజ్ భారీగా తగ్గుతుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని  పెట్రోలియం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ20 కోసం రూపొందించిన వాహనాల్లో వాడితే ఒకటి నుంచి రెండు శాతం వరకు మాత్రమే మైలేజ్‌లో తేడాలు ఉండవచ్చని, ఇతర వాహనాల్లో ఇది మూడు నుంచి ఆరుశాతం వరకు ఉండవచ్చని స్పష్టం చేసింది. 

అయితే, 2009 నుంచి పలు వాహనాల తయారీ కంపెనీలు ఈ20 అనుకూల వాహనాలను తయారు చేస్తుండడంతో మైలేజ్‌ ప్రభావం గణనీయంగా ఉండదని స్పష్టత ఇచ్చింది. డ్రైవింగ్‌ అలవాట్లు, వాహనాల సేఫ్టీ, టైర్ల ప్రెజర్‌, అలైన్‌మెంట్‌, ఏసీ వాడకం తదితర అంశాలు మైలేజ్‌పై ప్రభావం చూపుతాయని తెలిపింది.

 ఈ20లో 80శాతం పెట్రోల్‌, 20శాతం ఇథనాల్‌ ఉంటుందని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ20 ప్రభుత్వ జాతీయ కార్యక్రమని తెలిపింది.  తప్పుడు సమాచారం ఇస్తూ వాహనాల బీమా విషయంలో భయాందోళన వ్యాప్తి చేస్తున్నారని, ఈ పథకాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

 అయితే, ఈ20 వాడకం వల్ల కలిగే నష్టాలను బీమా కంపెనీలు భరించవని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ20 ఇంధనం వాడకం వాహనాల బీమా చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. నీతి ఆయోగ్‌ ప్రకారం.. చెరకు ఆధారిత ఇథనాల్‌ 65శాతం, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్‌ 50శాతం ఉద్గారాలను తగ్గిస్తుంది. 

గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్‌లో ఇథనాల్‌ను మిక్స్‌ చేసి పెట్రోల్‌ని విక్రయించడం వల్ల రూ.1.44లక్షల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశాయి. 245లక్షల టన్నుల ముడి చమురును భర్తీ చేశాయని, 736లక్షల టన్నుల సిఓO2 (కార్బన్-డై-ఆక్సైడ్) ఉద్గారాలను తగ్గించాయని తెలిపారు.  ఇది 30 కోట్ల చెట్లను నాటడానికి సమానం. ఈ సంవత్సరం 20 శాతం మిశ్రమంతో రైతులకు రూ.40వేలకోట్లు చెల్లించనున్నట్లు భావిస్తున్నారు. రూ.43వేలకోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని భావిస్తున్నారు. అయితే, ఇథనాల్‌ కలిపిన పెట్రోలియం ధర తక్కువగా ఉండాలని పలువురు వాదిస్తున్నారు. 

దీనికి మంత్రిత్వశాఖ స్పందిస్తూ 2020-21లో నీతి ఆయోగ్‌ నివేదిక తయారైన సమయంలో ఇథనాల్‌ చౌకగా ఉండేదని, ఇప్పుడు దాని ధర పెట్రోల్‌ కంటే ఎక్కువగా ఉందని తెలిపింది.  జీఎస్టీతో సహా లీటర్‌కు రూ.71కిపైగానే ఉందని పేర్కొంది. ఈ20 కోసం ట్యూనింగ్‌, విడిభాగాలను మార్చాల్సిన అవసరం ఉందని వాహనదారులు భావిస్తే.. అథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్స్‌ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.