ఆధార్ ను ప్రామాణిక పత్రంగా భావించలేం

ఆధార్ ను ప్రామాణిక పత్రంగా భావించలేం

పౌరసత్వం కోసం ఆధార్ ను ప్రామాణిక పత్రంగా భావించలేమని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే, దీనిని స్వతంత్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యానించింది.

“కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్నది సరైనదే. పౌరసత్వం జారీకి ఆధార్ను ప్రామాణికంగా అంగీకరించలేం. దీనిని కచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఇందుకు అధికారం ఉందా అన్న అంశాన్ని మొదటగా నిర్ణయించాలి. ఒకవేళ ఈసీకి అధికారం లేకపోతే ఏ సమస్య ఉత్పన్నం కాదు. కానీ వారికి అధికారం ఉంటే మాత్రం అనేక సమస్యలు ఎదురవుతాయి” అని సుప్రీంకోర్టు తెలిపింది.

ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక మంది ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫున హాజరైన కపిల్ సిబల్ వాదించారు. ముఖ్యంగా సరైన పత్రాలు సమర్పించని వారి ఓట్లు పోతాయని అన్నారు. 2003లో జాబితాలో చేరిన ఓటర్లు సైతం తాజాగా పత్రాలు సమర్పించాల్సి వస్తుందని తెలిపారు. ఒకవేళ సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోతారని పేర్కొన్నారు. 

ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం 7.24 కోట్ల మంది పత్రాలను సమర్పించినట్లు కపిల్ సిబల్ తెలిపారు. ఇంకా 65లక్షల మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. వీరందరిపై సరైన విచారణ చేపట్టకుండానే మరణాలు, వలస పేరిట తొలగించారని పేర్కొన్నారు. ఎలాంటి సర్వే చేపట్టలేదని ఈసీ సైతం అఫిడవిట్ దాఖలు చేసిందని బెంచ్కు చెప్పారు.

ఓ నియోజకవర్గంలో 12 మంది చనిపోయారని ఈసీ చెప్పిందని, కానీ వారు బతికే ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో ఘటనలో బతికే ఉన్న వ్యక్తులను చనిపోయినట్లు ప్రకటించారని కోర్టుకు చెప్పారు. అయితే ఇటువంటి ప్రక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ ధర్మాసనానికి విన్నవించారు. 

చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్లు, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లు ప్రకటించడం వంటి తప్పిదాలను సరిదిద్దవచ్చని, ప్రస్తుతం విడుదు చేసింది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని చెప్పారు. ఈ క్రమంలోనే స్పందించిన సర్వోన్నత న్యాయస్థానంం వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సూచించింది. 

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? గతంలో నమోదైన మరణాల సంఖ్య ఎంత? ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య ఎంత? వంటి వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పింది. బిహార్‌ ఎస్‌ఐఆర్‌లో సామూహికంగా ఓటర్లను తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటామని జులై 29న సుప్రీంకోర్టు పేర్కొంది. 

అంతకుముందు జులై 10న చేపట్టిన విచారణ సందర్భంగా బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. అదేవిధంగా ప్రాథమిక పత్రాలుగా ఆధార్‌, రేషన్‌ కార్డుతో పాటు స్వయంగా ఓటర్‌ ఐడీ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది.

కాగా, బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా ఈ నెల 1న ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఈ ప్రక్రియ చేపట్టక ముందు రాష్ట్రంలో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా, ముసాయిదాలో అది 7.24 కోట్లకు తగ్గింది. సెప్టెంబర్ 30న తుది జాబితాను ప్రకటించనుంది. ఈ క్రమంలోనే ఈసీ తీరుపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.