
“హర్ ఘర్ తిరంగ” కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరేందుకు సిద్దమవుతున్న బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ఇంటికి మంగళవారం తెల్లవారుజామునే అకస్మాత్తుగా పోలీసులు చేరుకొని ఆయనను గృహనిర్బంధం చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్దమ్మ దేవాలయం కూల్చివేతకు నిరసనగా అక్కడ హిందువులు చేబడుతున్న ఆందోళనలో పాల్గొనవచ్చని అనుమానంతో ఆయనను నిబంధించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గృహనిర్బంధం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ “ఈరోజు తెల్లవారుజామున పోలీసులు నా నివాసానికి వచ్చి నేను గృహ నిర్బంధంలో ఉన్నానని నాకు తెలిపారు. విచారణ తర్వాత, ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు కూల్చివేసిన బంజారాహిల్స్‌లోని పెదమ్మ ఆలయానికి సంబంధించి అని వారు నాకు చెప్పారు” అంటూ రామచంద్రరావు విస్మయం వ్యక్తం చేశారు.
“స్థానిక ప్రజలు దీనిని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఆలయ స్థలంలో పూజకు పిలుపునిచ్చారు. హిందూ ధర్మాలకు సంబంధించిన హిందూ సంస్థల కార్యక్రమాల కోసం పోలీసులు నన్ను అరెస్టు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సమస్యతో బిజెపికి సంబంధం లేకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ మత కార్యకలాపాలను పరిమితం చేస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ ధ్వజమెత్తారు.
తననే కాకుండా హైదరాబాద్ నగరంలోని అనేక మంది కార్పొరేటర్లను కూడా అరెస్టు చేసారని చెబుతూ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేసి, గృహనిర్బంధాలు అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని శవపేటికలో పెట్టిన అనేక ఘటనలు రాష్ట్రం చూసింది.
ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ, అణచివేత పాలనను కొనసాగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజ్యాంగ విలువలకు అవమానం అంటూ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొనకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమే అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ తీవ్రంగా ఖండించారు.
హర్ ఘర్ తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా దేశభక్తి ఉద్దేశంతో నిర్వహించబడుతున్న కార్యక్రమం అని పేర్కొంటూ రాంచందర్ రావు సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉందని సుభాష్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థాయి దేశభక్తి కార్యక్రమాన్నికూడా అడ్డుకోవడం, పోలీసుల ద్వారా ప్రతిపక్ష నాయకుడిని ఇంట్లో నిర్బంధించడం అనేది దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్బంధం చేయడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడివద్ద హిందూ సంఘాలు నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లే ప్రోగ్రాం లేకపోకపోయినా రామచంద్రరావును అడ్డుకోవడంపైనా మండిపడ్డారు.
‘‘అయినా పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? భాగ్య నగర్ లో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం’’అని ఆయన మండిపడ్డారు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోందన్నారని విమర్సించారు.
పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేస్తోందని సంజయ్ ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోందని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయని ఆయన హెచ్చరించారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!