అమెరికా సుంకాలతో మరో 50 దేశాలపై భారత్ దృష్టి

అమెరికా సుంకాలతో మరో 50 దేశాలపై భారత్ దృష్టి

భారత్‌ ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన వేళ కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది. అమెరికాకు ప్రత్యామ్నాయంగా పశ్చిమాసియా, ఆఫ్రికాల్లోని 50 దేశాలకు భారత్‌ ఎగుమతులు పెంచే చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ఎగుమతులు పెంచే చర్యలపై కృషి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  అయితే, ఈ 50 దేశాలు భారత్‌ ఎగుమతులు దాదాపు 90 శాతం వాటా కలిగి ఉన్నాయి.

ఎగుమతి విస్తరణ, దిగుమతి ప్రత్యామ్నాయం, ఎగుమతుల్లో పోటీతత్వం అనే అంశాల ఆధారంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశాలపై వివరణాత్మక విశ్లేషణ జరుగుతోందని, ఉత్పత్తుల వారీగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పని చేస్తున్నట్లు పేర్కొన్నాయి.  ఎగుమతులు పెంచేందుకు భారత్‌ ఇప్పటికే 20 దేశాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం భారత్‌ వ్యూహంలోకి మరో 30 దేశాలు చేరాయి.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సుంకాల మోత మోగించారు. గతంలో 25శాతం సుంకాలను విధించిన ఆయన, పెనాల్టీ రూపంలో ఆ తర్వాత మరో 25 శాతం సుంకాలు పెంచారు.  ఫలితంగా అమెరికాలోకి వెళ్లే భారతీయ వస్తువులపై సుంకాలు 50 శాతానికి పెరిగాయి. వీటిలో 25శాతం ఇప్పటికే అమల్లోకి రాగా, పెనాల్టీ రూపంలో పెంచిన 25 శాతం సుంకాలు ఈ ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇప్పటికే 25శాతం సుంకాలు అమల్లోకిరాగా వీటికి అదనంగా మరో 25 శాతం సుంకాలు ఈనెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్‌ వెల్లడించారు. ఈ సుంకాల ప్రభావంతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి చేస్తున్న 55 శాతం వస్తువులపై సుంకం పడుతోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా జూన్‌లో భారత్‌ ఎగుమతులు స్థిరంగా 35.14 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అయితే ఈ నెలలోనే వాణిజ్య లోటు 4 నెలల కనిష్ట స్థాయి 18.78 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.