ఎవరిది డెడ్ ఎకానమీనో భవిష్యత్ నిర్ణయిస్తుంది

ఎవరిది డెడ్ ఎకానమీనో భవిష్యత్ నిర్ణయిస్తుంది
 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనది డెడ్ ఎకానమీ అన్నారని మండిపడుతూ ఎవరిది డెడ్ ఎకానమీనో భవిష్యత్ నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు ఎద్దేవా చేశారు.  మనపై సుంకాలు వేయడం తాత్కాలికమే అని స్పష్టం చేస్తూ మనది గుడ్ ఎకానమీ అని, మన భారతీయుల సేవలు ప్రపంచానికి చాలా అవసరం అని స్పష్టం చేసారు. 
 
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  కుల, మత, ప్రాంత, భాషా భేదం లేకుండా దేశమంతా ఒకటే అనే జాతీయ భావన పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమని చెప్పారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను, ఉమ్మడి కృష్ణాజిల్లా ఖ్యాతిని సీఎం చంద్రబాబు కొనియాడారు.

“ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించింది. ఒకప్పుడు మనది పేద దేశం అనేవాళ్లు. 11 ఏళ్ల మోదీ పాలనలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 2028కి 3వ స్థానానికి చేరుతుంది. 2047లో వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా మనదేశం నిలుస్తుంది 2047 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.

“దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తలవంచదు. దేశ క్షేమం, భద్రత విషయంలో మనమంతా ఒకటే. కార్గిల్ యుద్ధం, పహల్గామ్ ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒక్క తాటిపై నిలిచింది. నేడు ఉన్నది ధృఢమైన భారతదేశం. విశ్వగురువుగా అవతరిస్తున్న భారతదేశం. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదానికి గట్టిగా బదులిచ్చాం. ఉగ్రవాదుల గుండెల్లో సైనికులు రైళ్లు పరుగెత్తించారు. ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహిద్దామని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ 2047 నాటికి ప్రపంచంలోనే మనదేశం అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు.

స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను, సైనిక కుటుంబాలను, రాష్ర్టానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారులను సీఎం చంద్రబాబు సత్కరించారు. విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడు గద్దె సత్యనారాయణ భార్య సుశీలను, వీరమహిళ రాంపిళ్ల నరసాయమ్మ కుమారుడు జయప్రకాష్‌ను, యుద్ధంలో మరణించిన సైనికుడు నాగరాజు సతీమణి మంగాదేవికి జ్ఞాపికలు అందజేశారు.