
హమాస్ అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఆల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆస్పత్రి బయట ఉన్న ప్రెస్ టెంట్ ధ్వంసమైంది.
అందులో ఉన్న ఐదుగురు జర్నిలస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, అందులో ఐదుగురు తమ పాత్రికేయులేనని అల్ జజీరా మీడియా సంస్థ పేర్కొంది. అనాస్ అల్ షరీఫ్ (ప్రముఖ రిపోర్టర్), మహ్మద్ క్రిఖే (కరస్పాండెంట్ ), ఇబ్రహిం జహెర్ (కెమెరామెన్), మహ్మద్ నౌఫాల్ (కెమెరామెన్), మొమెన్ అలీవా (అసిస్టెంట్) మరణించారు.
వీరితోపాటు ఫ్రిలాన్స్ జర్నలిస్ట్ మహ్మద్ అల్ ఖల్దితో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని వితౌట్ బోర్డర్స్ సంస్థ తెలిపింది. ఇజ్రాయిల్ ఈ దాడిని అధికారికంగా అంగీకరించింది. దాడిలో మరణించిన అన్సాల్ షరీఫ్‌కు హమాస్‌తో సంబంధముందని, ఉగ్రవాదని ఆరోపించింది. ఆల్ జజీరా యాజమాన్యం ఈ హత్యాకాండని ఖండించింది. ఇది గొంతు నొక్కే ప్రయత్నం, మీడియా స్వేచ్ఛపై ప్రణాళికాబద్ధమైన దాడి అని విమర్శించింది. 22 నెలలుగా గాజాలో జరుగుతున్న ఊచకోతను తమ జర్నలిస్టులు వెలుగులోకి తీసుకువస్తున్నారని. అక్టోబర్ 2023 నుండి ఇప్పటివరకు 269 మంది జర్నలిస్టులు మరణించారని, ఇందులో ఎక్కువమంది పాలస్తీనియన్లే అని పేర్కొంది.
అయితే, అనాస్ హమాస్ టెర్రరిస్ట్ సెల్‌కు హెడ్‌గా పనిచేసినట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది. జర్నలిస్టు ముసుగులో ఉన్న టెర్రరిస్ట్ షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఐడీఎఫ్ స్పష్టం చేసింది. కాగా, ఈ దాడికి కొన్ని నిమిషాల ముందు అనాస్ అల్ షరీప్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. గాజా నగరంలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసిందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పెట్టిన కాసేపటికే ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో అతడు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా