ఆగస్టు 9  స్థానిక ప్రజల సంస్కృతి పరిరక్షణ దినోత్సవం

ఆగస్టు 9  స్థానిక ప్రజల సంస్కృతి పరిరక్షణ దినోత్సవం

సంస్కృతీ సంప్రదాయాల ప్రరిరక్షణ ధ్యేయంగా ఆగస్టు 9న వరల్డ్ ఇండీజీనియస్ పీపుల్స్ డే పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు ‘ఆదీవాసీ దివస్’ పేరిట ర్యాలీ నిర్వహించారు. కొమరం భీం ఫౌండేషన్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అప్పాల ప్రసాద్.. అమెరికా, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్, కెనడా తదితర దేశాలలో పకృతితో మమేకమై జీవిస్తున్న సుమారు 7 లక్షల 50వేల మంది ప్రజలను విష ప్రయోగాలతో సామూహిక మారణకాండకు గురిచేసిన విషయాలను గుర్తుచేశారు.

అదే విధంగా అనేక పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి పేరిట అటవీప్రాంత వాసులపై మారణకాండ జరిపారని అన్నారు. అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నవారిని ద్వితీయ శ్రేణి ప్రజలుగా పరిగణిస్తూ వారిపై దుశ్చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు పోరాటాలు చేశారని అన్నారు. వారి పోరాటాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9వ తేదీని ప్రపంచ స్థానిక ప్రజల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని అన్నారు. ఈ రోజునే కొందరు ఆదివాసీ దివస్ అనీ, మరికొందరు మూలవాసీ దివస్ అని ఇంకా అనేక పేర్లతో నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఎవరు ఎలా జరుపుకున్నప్పటికీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పినట్టుగా వనవాసులమైనా, గ్రామవాసులమైనా, నగరవాసులమైనా, అంతిమంగా మనందరమూ భారతవాసులం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు.

‘జల్, జంగల్, జమీన్’ – ఇది రాజకీయ నినాదం కాదని, ఎక్కడైతే భూమి పచ్చగా ఉంటుందో, ఎక్కడైతే అడవి శాతం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందో అక్కడ నివసించే ప్రజలు, పశుపక్షాదులు సుభిక్షంగా ఉంటాయని ప్రపంచానికి చాటినవారు అటవీప్రాంత వాసులు అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి గ్రామపంచాయతీలో పెసా చట్టం పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలి అని డిమాండ్ చేశారు. అటవీప్రాంతం నుండి వచ్చినవారికి గవర్నమెంట్ ఆఫీసుల్లో,  పోలీస్ స్టేషన్లో ఎక్కడా కూడా విలువ ఇవ్వడం లేదని, వారికి గౌరవం కల్పించేలా ప్రభుత్వం చొర చూపాలి అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి  ఐటీడీఏల ద్వారా అందే పథకాలు ఏమిటో అటవీప్రాంతం వాసులకు తెలియటం లేదని, ఆ పథకాలపై వారికి అవగాహన కల్పించాలని, పోడు భూములలో ప్రభుత్వం నీటి బోర్లు వెయ్యాలి అని కోరారు.

షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రజల ఇలవేల్పు దేవతల జాతర్లకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే జాతరకయ్యే  ఖర్చులు భరించాలన్నారు అప్పాల ప్రసాద్ కోరారు.  అటవీప్రాంత గ్రామాలలో నివసిస్తున్నవారికి కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలవేసి ‘ఆదివాసి జెండా’ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన నాయకులు తెల్లం నరసింహరావు, ఎదలపల్లి వీరభద్రం, మాజీ ఎంపీపీ పోడం సీత, సోడే శ్రీరాములు, సిద్ధబోయిన రామ్మూర్తి, కాలం నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.