ఆసిమ్ మునీర్‌ ఓ సూట్ ధ‌రించిన‌ ఒసామా బిన్ లాడెన్

ఆసిమ్ మునీర్‌ ఓ సూట్ ధ‌రించిన‌ ఒసామా బిన్ లాడెన్
 
* బలూచ్‌ ఆర్మీని అంతర్జాతీయ ఉగ్రసంస్థగా గుర్తించిన అమెరికా
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఉగ్ర‌వాది ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు పెంట‌గాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్‌. ఏఎన్ఐ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యుద్ధ కాంక్ష‌తో ఉన్న పాకిస్థాన్ ఓ దుష్ట దేశంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. అమెరికాలో సెప్టెంబ‌ర్ లెవ‌న్ దాడుల‌కు కార‌ణ‌మైన అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాది ఒసామా బిన్ లాడెన్ త‌ర‌హాలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోపించారు.

తాజాగా ఫీల్డ్ మార్ష‌ల్ ఆసిమ్ మునీర్‌ అణ్వాయుధ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఒక‌వేళ పాకిస్థాన్ ఓడిపోయే ద‌శ‌లో ఉంటే. అప్పుడు త‌మ‌తో పాటు స‌గం ప్రపంచాన్ని తీసుకెళ్తామ‌ని అణు హెచ్చ‌రిక‌లు చేశారు. ఫ్లోరిడాలోని థంపాలో జ‌రిగిన అమెరికా మిలిట‌రీ అధికారుల భేటీలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  ఈ నేప‌థ్యంలో పెంటగాన్ మాజీ అధికారి స్పందిస్తూ అమెరికా నేల‌పై పాకిస్థాన్ చేసిన బెదిరింపులు అమోద‌యోగ్యం కాదని స్పష్టం చేశారు. 

స‌మ‌స్యాత్మ‌క కోణంలో ఉగ్ర‌వాదాన్ని అమెరికా చూస్తుంద‌ని, అనేక మంది ఉగ్ర‌వాదుల ఐడియాల‌జీ అర్థం కాదని, సూట్ ధ‌రించిన ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడు ఆసిమ్ మునీర్ అని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇస్లామిక్ స్టేట్ వ్యాఖ్య‌ల త‌ర‌హాలో ఫీల్డ్ మార్ష‌ల్ ప్ర‌క‌ట‌న ఉన్న‌ట్లు రూబిన్ తెలిపారు. పాకిస్థాన్‌లో ఉన్న అణ్వాయుధ కేంద్రాల‌ను అమెరికా సీల్ ద‌ళాలు స్వాధీనం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

పాకిస్థాన్‌ను నాన్‌-నాటో స‌భ్య దేశంగా చూడాల‌ని, యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ స‌భ్య‌దేశంగా చూడ‌వ‌ద్దని రూబిన్‌ హితవు చెప్పారు. ఆసిమ్ మునీర్‌కు ఎప్ప‌టికీ యూఎస్ వీసా ఇవ్వ‌కూడ‌ద‌ని స్పష్టం చేశారు.  మరోవంక, పాకిస్థాన్‌ ఆర్మీ ఫీల్డ్‌ మార్షల్‌ సయ్యద్‌ అసిం మునీర్‌ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో పాకిస్థాన్‌లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతూ అక్కడి సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, దానికి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది.

బీఎల్‌ఏని 2019లోనే ‘స్పెషల్లీ డెజిగ్నేటెడ్‌ గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ (ఎస్‌డీజీటీ)’ జాబితాలో చేర్చిన అమెరికా, తాజాగా మజీద్‌ బ్రిగేడ్‌ను కూడా బీఎల్‌ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్‌ విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు.
ఇటీవలే కాలంలో బీఎల్‌ఏకు చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ పాక్‌లోని పలు ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పాక్‌ సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తోంది. 2024లో కరాచీ ఎయిర్‌పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై బీఎల్‌ఏ దాడులు చేపట్టింది. ఇక ఈ ఏడాది అంటే 2025లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్ చేసి దాదాపు 300 మంది ప్యాసింజర్లను బందీలుగా చేసుకుంది.