పుతిన్- ట్రంప్ భేటీకి జెలెన్స్కీకి కూడా ఆహ్వానం!

పుతిన్- ట్రంప్ భేటీకి జెలెన్స్కీకి కూడా ఆహ్వానం!
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ని కూడా ఆహ్వానించడానికి ట్రంప్‌ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.

వాస్తవానికి అలాస్కాలో పుతిన్, జెలెన్‌స్కీతో త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని ముందే ట్రంప్‌ భావించారు. ఇటీవల అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ మాస్కో పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రతిపాదించారు. దీనిపై క్రెమ్లిన్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తొలుత పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించాలని భావించారు. 

ఈ నేపథ్యంలో భేటీకి జెలెన్‌స్కీని ఆహ్వానించడంపై ట్రంప్‌ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. శాంతి చర్చల్లో కీవ్‌ను కూడా భాగం చేయాలని యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, ఫిన్లాండ్ వంటి యూరోపియన్‌ దేశాలు ఇప్పటికే అగ్రరాజ్యానికి విజ్ఞప్తి చేయడం కూడా ట్రంప్‌ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అమెరికాలోని అలాస్కాలో పుతిన్‌తో భేటీ అవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ఈ సమావేశంలో పుతిన్ తో యుద్ధాన్ని ముగించడంపై చర్చలు జరపనున్నారని పేర్కొన్నారు. శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పడి ఉంటుందని ట్రంప్ తెలిపారు. అయితే భూభాగాల మార్పిడికి అంగీకరించేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు.  ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ట్రంప్- పుతిన్ భేటీని భారత్ స్వాగతించింది.

ఇది యుద్ధ యుగం కాదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసే వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ ఈ సమావేశానికి భారత్ మద్దతు ఇస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సమావేశం ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి మద్దతు తెలుపుతూ, ఈ ప్రయత్నాలకు సహకారం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఒక ప్రకటనను విడుదల చేసింది.