రాహుల్ `ఓట్ల చోరీ’పై విమర్శించిన కర్ణాటక మంత్రి రాజీనామా!

రాహుల్ `ఓట్ల చోరీ’పై విమర్శించిన కర్ణాటక మంత్రి రాజీనామా!
కర్నాటక సహకార మంత్రి, ముఖ్యమంత్రి మద్దతుదారుడైన కేఎన్‌ రాజన్న తన పదవికి రాజీనామాచేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మద్దదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓట్ల చోరీ అంశంపై సొంత పార్టీపై ఆయన విమర్శలు గుప్పించడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 
 
గతవారంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ బెంగళూరులో ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని,  బెంగళూరు సెంట్రల్‌ వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఓట్ల చోరీయే కారణమని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజన్న కీలక వ్యాఖ్యలు చేశారు.  మన సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితాలను సవరించారని గుర్తుంచుకోవాలని, ఆ సమయంలో పార్టీ ఎందుకు కళ్లు మూసుకుందని ఆయన ప్రశ్నించారు.
అక్రమాలు జరుగుతున్నాయన్నది నిజమే, కానీ, అన ముక్కు కిందనే జరిగిందనేది మనకు అవమానకరం అంటూ ధ్వజమెత్తారు.  ఓటర్ల జాబితా వంటి అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోవడం మన బాధ్యత అవుతుందని రాజన్న స్పష్టం చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించిన తర్వాత ఈసీఐ అభ్యంతరాలను ఆహ్వానించిందన్న విషయాన్ని ఆయన ఎత్తి చూపారు.
పలువురు రాజన్న వ్యాఖ్యలను స్వాగతించగా, మరికొందరు సీనియర్లు పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  రాజన్న వ్యాఖ్యలపై డీకే వర్గీయులు మండిపడ్డారు. ఆయన పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కర్నాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మద్దతుదారుల మధ్య సీఎం పదవి విషయంలో అంతర్గత విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.