
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కర్నాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఓట్ల దొంగతనంపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని కోరారు. మహదేవపుర నియోజకవర్గంలోనే నకిలీ ఎంట్రీలు, ఫేక్ అడ్రస్‌లు, ఒకే చోట రిజిస్ట్రేషన్ ద్వారా 1,00,250 ఓట్లు దొంగిలించారని రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈసీఐ డేటా ఆధారంగా 70 సంవత్సరాల ఓటరు శకున్ రాణి రెండుసార్లు ఓటు వేశారన్న రాహుల్ ఆరోపణలపై నోటీసుల్లో పేర్కొంది. సీఈవో కార్యాలయం ప్రాథమిక విచారణలో ఆమె ఒకేసారి మాత్రమే ఓటు వేసిందని పేర్కొంది. శకున్ రాణి లేదంటే, మరెవరైనా సరే రెండుసార్లు ఓటు వేశారని మీరు నిర్ధారించిన సంబంధిత పత్రాలను అందించాలని, తద్వారా వివరణాత్మకంగా విచారణ చేపట్టవచ్చని సీఈవో అన్బుకుమార్ నోటీసుల్లో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రజంటేషన్‌లో చూపించిన టిక్ మార్క్ చేసిన పత్రం పోలింగ్ అధికారి జారీ చేసిన పత్రం కూడా కాదని వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నికలను ఈసీ కొరియోగ్రఫీ చేస్తోందని ఆరోపించారు.
ఈ సమావేశంలోనే మహదేవపుర నియోజకవర్గంలో ఫేక్ ఓటర్ల నమోదు, ఫేక్ చిరునామాలు, ఒకే చోట బల్క్ రిజిస్ట్రేషన్ ద్వారా లక్షకుపైగా ఓట్లను దొంగిలించినట్లుగా రాహుల్ ఆరోపించారు. ఇది ఎన్నికల కమిషన్ డేటా అని.. ఈ సమాచారాన్ని ఎవరూ తిరస్కరించలేరన్నారు. అయితే, ఈసీని మరోసారి టార్గెట్ చేస్తూ votechori.in వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. ఇందులో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలపునిచ్చారు.
“దయచేసి సంబంధిత పత్రాలను అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దాని ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారా లేదా అనే దానిపై వివరణాత్మక విచారణ నిర్వహిస్తాము” అని ఈసీ తన లేఖలో రాహుల్ గాంధీని కోరింది. రాహుల్ గాంధీ ఈ నోటీసుకు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను గౌరవిస్తుందని, అవసరమైన పత్రాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మరోవంక, సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో ‘ఓటు దొంగతనం అనేది ఒక వ్యక్తి, ఒక ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం దాడి. స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటరు జాబితా అవసరం’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
`ఎన్నికల కమిషన్ పారదర్శకతను చూపించాలి. డిజిటల్ ఓటర్ లిస్ట్‌ను బయటపెట్టాలి. తద్వారా ప్రజలు, రాజకీయ పార్టీలు దాన్ని స్వయంగా ఆడిట్ చేయాలి. మీరు కూడా మాతో చేరి ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వొచ్చు. votechori.in/ecdemand వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. లేదంటో 9650003420 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వండి’ అని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ పోరాటం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికేనని స్పష్టం చేశారు
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం