
అమెరికాకు అతిపెద్ద స్మార్ట్ఫోన్ల ఎగుమతిదారుగా భారత్ అవతరించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా మన దేశం ఉందని తెలిపారు. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో భారత్ పాత్ర నానాటికీ పెరుగుతోందని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో భారత్‌లో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని ఆయన చెప్పారు.
దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం విలువ రూ.12 లక్షల కోట్లకు చేరిందని, వాటి ఎగుమతుల విలువ 8 రెట్లు పెరిగి, రూ.3 లక్షల కోట్లు అయిందని తెలిపారు. టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో భారత్‌ను ప్రపంచ హబ్‌గా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం వల్లే ఇవన్నీ సాకారం అవుతున్నాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. పౌరులందరికీ టెక్నాలజీని చేరువ చేయాలనే విజన్‌తో కేంద్ర సర్కారు ముందుకు సాగుతోందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2014లో భారత్‌లో కేవలం 2 ఫోన్ల తయారీ యూనిట్లే ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో 300కుపైగా ఫోన్ల తయారీ యూనిట్లు ఉన్నాయి.2014 – 2015 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌లో విక్రయమయ్యే ఫోన్లలో కేవలం 26 శాతమే దేశంలో తయారయ్యేవి. మిగతావన్నీ విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యేవి.
ప్రస్తుతం భారత్‌లో విక్రయిస్తున్న ఫోన్లలో 99.2 శాతం ఇక్కడి యూనిట్లలోనే తయారవుతున్నాయి. 2014 నాటికి భారతదేశ ఫోన్ల తయారీ పరిశ్రమ విలువ రూ.18,900 కోట్లే. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విలువ కాస్తా రూ.4.22 లక్షల కోట్లకు పెరిగింది.
More Stories
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!
దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్