సామాన్యులకు అందుబాటులో లేని ఆరోగ్యం, విద్య

సామాన్యులకు అందుబాటులో లేని ఆరోగ్యం, విద్య
 
ఒక వ్యక్తికి అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటైన ఆరోగ్య సంరక్షణ, విద్య  ప్రస్తుత కాలంలో సామాన్యులకు అందుబాటులో లేవని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్  డా. మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇండోర్‌లో శ్రీ గురూజీ సేవా న్యాస్ పబ్లిక్ ట్రస్ట్ ప్రాజెక్ట్ అయిన మాధవ్ సృష్టి ఆరోగ్య కేంద్రం, క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆదివారం మాట్లాడుతూ, గతంలో సామాజిక సేవా రంగాలుగా ఉన్న పాఠశాలలు, ఆసుపత్రులను అధికంగా వాణిజ్యీకరించడం వల్ల భారతదేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ రెండూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని విచారం వ్యక్తం చేశారు. 
 
“ఆరోగ్యం, విద్య అనేవి ప్రపంచవ్యాప్తంగా సమాజానికి చాలా అవసరమైన రెండు అంశాలుగా మారాయి. నేటి కాలాన్ని మనం నేర్చుకునే యుగం అని పిలుస్తాము. మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు, మన శరీరమే దానికి మార్గం. కాబట్టి, మనకు ఆరోగ్యకరమైన శరీరం ఉంటే తప్ప మనం తెలివైనవారు కాలేరు” అని తెలిపారు.  “ఒక వ్యక్తి తన పిల్లలకు ఉత్తమ విద్యను అందించడానికి తన ఇంటిని అమ్మవచ్చు. తనకు ఉత్తమ ఆరోగ్య సంరక్షణ పొందడానికి అతను తన ఇంటిని కూడా అమ్మేస్తాడు. ఈ రెండు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం విడ్డూరం” అని డా. భగవత్ విస్మయం వ్యక్తం చేశారు. 
 
 “ఆసుపత్రులు లేదా విద్యాసంస్థలు తగ్గడం లేదు. కొత్త ఆసుపత్రులు,  పాఠశాలలను వేగంగా నిర్మిస్తున్నారు. కానీ వాణిజ్యీకరణ వాటిని సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసింది” అని ఆయన పేర్కొన్నారు. “భారతదేశంలో విద్య ట్రిలియన్ డాలర్ల వ్యాపారం అని గతంలో ఒక మంత్రి చెప్పినట్లు నేను విన్నాను. ఇప్పుడు వ్యాపారం సామాన్యులకు సంబంధించినది కాదు. డబ్బు ఉన్నవారు వ్యాపారం చేస్తారు” అని ఆ మంత్రి ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పారు. 
డాక్టర్ భగవత్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, తాను చిన్నప్పుడు మలేరియాతో బాధపడుతున్నప్పుడు మూడు రోజులు పాఠశాలకు వెళ్లలేకపోయానని గుర్తు చేసుకున్నారు. తన గురువు తన ఇంటికి వచ్చి, అడవిలోకి వెళ్లి ఔషధ మూలికలను సేకరించి, తనకు చికిత్స చేశారని చెబుతూ ఇది ఉపాధ్యాయుడి నిజమైన పాత్రను ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.
 
 విద్యార్థి అభ్యాసం పట్ల మాత్రమే కాకుండా వారి శ్రేయస్సు పట్ల కూడా శ్రద్ధ వహించడం తమ బాధ్యతగా ఉపాధ్యాయులు భావించేవారని డా. భగవత్ చెప్పారు. నేటి సమాజానికి అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ అవసరం అని స్పష్టం చేస్తూ విద్య వ్యాపారానికి కేంద్రంగా మారగా  వ్యాధులు శాశ్వతమై మానవులు నశించినప్పుడు మాత్రమే అవి అంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


“గతంలో, విద్య అనేది ఉపాధ్యాయుల విధి. వారు తమ విద్యార్థుల గురించి ఆందోళన చెందేవారు. వైద్యులు చికిత్స అందించడానికి పిలవకుండానే రోగుల ఇంటికి చేరుకునేవారు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒక వృత్తిగా మారారు” అని డా. భగవత్ తెలిపారు, దేశంలో సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స తక్షణ అవసరాన్ని డా. భగవత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
 
భారతదేశంలో ఖరీదైన క్యాన్సర్ చికిత్స గురించి కూడా సర్ సంఘచాలక్ ప్రస్తావిస్తూ  “దేశంలోని ఎనిమిది నుండి 10 నగరాల్లో మాత్రమే మంచి క్యాన్సర్ చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రోగులు అక్కడికి వెళ్లడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది” అని ఆయన చెప్పా రు. సమాజంలోని సమర్థులు, వనరులున్న సభ్యులు పౌరులకు మంచి ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలను అందించడానికి ముందుకు రావాలని డా. భగవత్ ఈ సందర్భంగా పిలుపిచ్చారు.