భారత్‌పై ట్రంప్‌ పక్షపాతి వైఖరిపై హెచ్చరిక

భారత్‌పై ట్రంప్‌ పక్షపాతి వైఖరిపై హెచ్చరిక
రష్యా, చైనాల నుంచి భారత్‌ను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీరుగార్చారని ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ధ్వజమెత్తారు. చైనా పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ, భారత్‌పై ట్రంప్‌ చూపిస్తున్న పక్షపాతి వైఖరి భవిష్యత్తులో అమెరికాకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

భారత్ పట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న కఠినమైన వైఖరిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. వీరితోపాటు మాజీ ఉద్యోగులు కూడా తప్పుడు విధానాలను ఖండిస్తున్నారు. తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్‌, ట్రంప్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. 

రష్యా నుంచి భారీగా చమురు కొంటున్న చైనాపై ట్రంప్ సుంకాలు విధించకపోవటంతో, భారత్ తీవ్రంగా స్పందించిందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు. 50 శాతం సుంకాల కారణంగా భారత్‌- చైనా, రష్యాలతో జట్టు కట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మూడు దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 

అంతేకాదు చైనా పట్ల ట్రంప్ సానుకూలంగా వ్యవహరించడాన్ని అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లను నిలువరించలేకపోయాయని జాన్ బోల్టన్ గుర్తు చేశారు. పైగా భారత్ తన చమురు కొనుగోళ్లను గట్టిగా సమర్థించుకుందని చెప్పారు. 

ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు భవిష్యత్తులో అమెరికాకు ప్రతికూల ఫలితాలను తీసుకొస్తాయని జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. సుంకాల కారణంగా అమెరికా-భారత్‌ మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్‌ తెలిపారు. అమెరికా విశ్వసనీయతపైనా ప్రశ్నలు రేకెత్తించే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లనుందనే ఆందోళనలు ఆ దేశంలో వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా ఆర్థికవేత్త, జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీవ్‌ హాంకీ ‘తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిద’నేది నెపోలియన్‌ మాటను గుర్తుచేశారు.  ఇప్పుడు ట్రంప్‌ కూడా ప్రపంచదేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అనిపిస్తోందని హెచ్చరించారు.
సుంకాల పేరుతో ట్రంప్‌ కడుతున్న పేక మేడ త్వరలోనే కూలిపోతుందని దుయ్యబట్టారు. అప్పటివరకు భారత్‌ ఆయన జోలికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. ”సుంకాలపై ట్రంప్‌ నిర్ణయాలు పూర్తిగా అర్థరహితం. ఇక్కడో విషయం చెప్పాలి. భారత్‌ విషయానికొస్తే ప్రస్తుతం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌ కొంతకాలం ఓపిక పట్టి ఎదురుచూడాలి. ఎందుకంటే ట్రంప్‌ పేకమేడ త్వరలోనే కూలిపోతుంది” అని ఆ ప్రొఫెసర్‌ అభిప్రాయపడ్డారు.