
దేశంలో పది లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 368వ పార్లమెంటరీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో ఖాళీల సంఖ్య అధికంగా ఉన్నదని తెలిపింది. వీటిలో ఏడున్నర లక్షల పోస్టులు ఫౌండేషన్ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయని చెప్పింది. ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయకపోతే దీర్ఘకాలిక పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించింది.
ఖాళీలు కేవలం గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాలేదని, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలలో కూడా 30-50 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎత్తిచూపింది. శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు సిబ్బందితో నెట్టుకొస్తున్నారని, దీనివల్ల విద్యలో నాణ్యత దెబ్బతింటోందని తెలిపింది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీలకు రిజర్వేషన్లను సక్రమంగా వర్తింపజేయడం లేదని పార్లమెంటరీ నివేదిక వివరించింది. జూన్ నాటికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఈటీ) 54 శాతం గ్రూప్ ఏ పోస్టులు, 43 శాతం గ్రూప్ బీ పోస్టులు, 89 శాతం గ్రూప్ సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
2019 నుంచి శాశ్వత ప్రాతిపదికన నియామకాలే జరగడం లేదని గుర్తు చేసింది. దీంతో ఆ సంస్థ విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను సమర్ధవంతంగా నియంత్రించలేకపోతోందని, సమన్వయం లోపిస్తోందని చెప్పింది. నూతన రెగ్యులేటరీ ప్రతిపాదనలను కూడా నివేదిక తప్పుపట్టింది. ఉపాధ్యాయ విద్య అవసరానికి మించి కేంద్రీకృతం కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
More Stories
30 నాటికి ఎస్ఐఆర్ అమలుకు సిద్ధంగా ఉండండి
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి