
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు కాషాయ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు హాజరై బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.
కొన్ని రోజుల క్రితమే గువ్వల బాలరాజు బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించి పార్టీ నాయకత్వం స్పందించలేదని, తగిన ప్రాధాన్యం కల్పించకపో వడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో, ఆయన ఇక ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారన్న చర్చకు తెరలేపి చివరకు బీజేపీలో చేరారు. దీంతో ఆయన్ను చుట్టుముట్టిన ఊహాగానాలకు ముగింపు లభించింది.
బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారుతోందని, రెండు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన బాలరాజు దాన్ని గుర్తించి, ప్రధాని నరేంద్ర మోదీ బడగు, బలహీన వర్గాల ప్రజలకు, దేశ అభివృద్ధి కోసం చేస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని ఈ సందర్భంగా రాజచందర్ రావు చెప్పారు. అతఁచంపేట్ ప్రాంతంలోనే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణాలో బిజెపి గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.9 శాతం ఓటుశాతం సాధించగా, 2024 పార్లమెంట్ (లోక్‌సభ) ఎన్నికల్లో 36 శాతానికి పైగా ఓటుశాతం పెరిగిందని ఆయన గుర్తు చేశారు. బిజెపి 8 ఎంపీ సీట్లలో గెలుపొందగా, బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదని, ఆ పార్టీ పరిస్థితి సున్నా అయిందని చెప్పారు. పైగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 2 సీట్లు కైవసం చేసుకుందని తెలిపారు.
రానున్న రోజుల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీకి “గేట్‌వే ఆఫ్ తెలంగాణ” అవుతుందని, దానికి గువ్వల బాలరాజు పార్టీలో చేరడం నిదర్శనం అని రామచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లో 16 జిల్లాల్లో 3500 కి.మీ. మేరకు పర్యటించానని చెబుతూ ఎక్కడికెళ్లినా ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు వంటి అనేకమంది పార్టీలో చేరారని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనం అని తెలిపారు.
మేధావులు, న్యాయవాదులు, రైతులు, యువత, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు .. అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరాలని ఆయన ఆహ్వానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి, కుటుంబ పాలన, నిరంకుశ పాలన ప్రజలను విసిగించాయని, ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేసినా, 19 నెలల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.
గత రెండు పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ఆ రెండు పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను మోసం చేశాయని పేర్కొంటూ ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు. ప్రజా స్పందన చూస్తుంటే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించడమే కాకుండా, బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం అని భరోసా వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పర్యటనలో పాల్గొన్న ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించిందని తెలిపారు.
More Stories
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్