
దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ప్రమాణం చేయగలరా? అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. “రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పదేళ్ల్ల అవినీతికి మేం రక్ష, మా దోపిడీకి మీరు రక్ష’ అంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకరికొకరు అవినీతి, దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నాయి’ అని ఆయన మండిపడ్డారు.
బిఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలినా కెసిఆర్ కుటుంబంపై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడానికి ఆ రెండు పార్టీల మధ్యనున్న ‘రక్షా’ బంధమే కారణమని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్లో చర్చించిన రేవంత్ రెడ్డి ప్ర భుత్వం విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ నివేదికను కేబినెట్లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.
పెద్ద ఎత్తున వాటాలు ముట్టినందునే ఆ కమిషన్ నివేదిక గురించి కనీసం పెదవి కూడా విప్పడం లేదని పేర్కొంటూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెటిఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే చేసిన తప్పులు, పాపాల నుండి తప్పించుకునేందుకు లీగల్ నోటీసుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తమ వద్ద సమాచారముందని, ఆధారాలు ఉన్నాయని తెలిపారు. “ఇదే విషయంపై ఏ గుడికైనా కుటుంబ సభ్యులతో కలిసి వస్తా. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తా. అదే సమయంలో నువ్వు కూడా నీ భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని వాళ్లందరితో కలిసి ప్రమాణం చేస్తావా?”అని కెటిఆర్‌కు సవాల్ విసిరారు.
బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప కెసిఆర్ కుటుంబంపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని సంజయ్ ధ్వజమెత్తారు. “కాళేశ్వరంపై ఎన్డిఎస్ఏ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. దీనిపై కేబినెట్లో చర్చ జరిగింది. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మళ్లీ అసెంబ్లీ పేరుతో కాలయాపన ఎందుకు?” అని ప్రశ్నించారు.
అదేవిధంగా‘విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై కమిషన్ నివేదిక ఇచ్చింది. మరి దీనిపై కేబినెట్లో ఎందుకు చర్చించలేదు? దీనిపై ఎందుకు స్పందించడం లేదు? విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల సొమ్ములో వా టా ముట్టింది కాబట్టి దీనిపై నోరు విప్పడం లేదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
More Stories
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు
హనీట్రాప్‌లో ఓ ప్రముఖ యోగా గురువు
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర