
బంగ్లాదేశ్‌లో 13వ పార్లమెంట్ ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించడం సవాలుతో కూడుకున్న పని అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం.నసీరుద్దీన్ అంగీకరించారు. ఎన్నికలు నిర్వహించే కచ్చితమైన తేదీని షెడ్యూలు ప్రకటించడానికి రెండు నెలల ముందే వెల్లడిస్తామని చెప్పారు.
ప్రజలు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని, ఎన్నికల కమిషన్‌ది, ఎన్నికలు నిర్వహించే పరిపాలనా యంత్రాంగానిదీ అదే పరిస్థితి అని వెల్లడించారు. కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో దేశ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహ్మద్ యూనస్ ఈ నెల 5న ప్రకటించిన విషయం తెలిసిందే.
రాబోయే రంజాన్ కంటే ముందుగానే అంటే 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, జులై 2024 తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనమైన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తిరుగుబాటు చేయడంతో చివరకు హసీనా ప్రభుత్వం ఆగస్టు 2024న పడిపోగా, ఆమె భారత్‌కు చేరుకుంది. ఆ తర్వాత యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లోని రాజకీయ పార్టీలు తాజా సార్వత్రిక ఎన్నికలను డిమాండ్ చేస్తున్నాయి.
కాగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఆవామీలీగ్ కార్యకలాపాలను తాత్కాలిక ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో మరో మాజీ ప్రధాని ఖాలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో విజయం సాధించనుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో తాము పాల్గొంటామని బీఎన్పీ తాత్కాలిక అధ్యక్షడు, ఖాలీదా కుమారుడు తారెఖ్ రెహ్మాన్ వెల్లడించారు.
అయితే జూలైలో తిరుగుబాటు చేసిన నాయకుల నుంచి ఏర్పడిన కొత్త రాజకీయ పార్టీ నేషనల్ సిటిజన్ పార్టీ సైతం రానున్న ఎన్నికల్లో పోటీ చేయనుంది. మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనా యొక్క అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలను రద్దు చేయడంతో ఆ పార్టీ భవిష్యత్తుపై ఇంకా సందిగ్ధత నెలకొంది. దీంతో బంగ్లాదేశ్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాల్సిందే. ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
దేశంలో పూర్తి స్థాయి ప్రజాస్వామ్యాన్ని, స్థిరమైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి ఇవి కీలకంగా మారబోతున్నాయి. బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలకు ఈ ఎన్నికలు ఒక పరిష్కారాన్ని చూపుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఎన్నికలు నిజంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగితే, అది బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యానికి ఒక కొత్త దశను తీసుకు వస్తుంది.
More Stories
భారత నాగరిక ఆత్మ సంరక్షకునిగా వందేళ్ల ఆర్ఎస్ఎస్
బాగ్రామ్ స్థావరంపై ట్రంప్ ప్రయత్నంకు వ్యతిరేకం
గాజా మారణకాండకు ముగింపుకు కైరోలో చర్చలు