
* ఆపరేషన్ సిందూర్ రక్షణ రంగంలో స్వావలంబనకు నిదర్శనం
2024-25లో భారతదేశ వార్షిక రక్షణ ఉత్పత్తులు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,50,590 కోట్లకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది 2023-24లో ఉన్న రూ.1.27 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం వృద్ధిని సూచిస్తుందని చెప్పారు. అంతేకాకుండా, ఈ పెరుగుదల 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి చూస్తే, ఏకంగా 90 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుందని, అప్పట్లో దీని విలువ రూ.79,071 కోట్లుగా ఉందని వివరించారు.
“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత రక్షణ రంగ ఉత్పత్తులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ గణాంకాలు గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షలతో పోలిస్తే, ఇది దాదాపు 18 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి” అని చెప్పారు. “2019-20లో కేవలం రూ.79,071 కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులు జరిగాయి. ఆనాటితో పోలిస్తే, నేడు దేశంలో 90 శాతం ఎక్కువగా డిఫెన్స్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ గొప్ప మైలురాయిని సాధించడంలో డిఫెన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ రక్షణ రంగ యూనిట్లు, ప్రైవేటు పరిశ్రమల సమిష్టి కృషి ఉంది” అని రాజ్ నాథ్ సింగ్ వివరించారు.
ఈ మైలురాయిని సాధించడంలో రక్షణ ఉత్పత్తి శాఖ, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ తయారీదారులు, ఇంకా ప్రైవేట్ పరిశ్రమలతో సహా అందరి సమిష్టి కృషిని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది భారతదేశ రక్షణ పారిశ్రామికరంగ పెరుగుదలకు స్పష్టమైన సూచికగా మంత్రి అభివర్ణించారు. ఢిల్లీలో ఈ మేరకు రక్షణ మంత్రి వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఉత్పత్తిలో దాదాపు 77 శాతం వాటాను కలిగి ఉండగా, ప్రైవేట్ రంగం 23 శాతం వాటాను కలిగి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 శాతం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23 శాతానికి పెరిగిన ప్రైవేట్ రంగం వాటా, దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థలో తన పాత్రను వెల్లడిచేస్తుందని ఆయన చెప్పారు.
గత దశాబ్దంలో విధాన సంస్కరణలు, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం, స్వదేశీ తయారీపై వ్యూహాత్మక ముందుచూపు కారణంగా రక్షణ పరిశ్రమలోని ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాలు రెండూ స్థిరమైన వృద్ధిని ప్రదర్శించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డి పీ ఎస్ యులు, ప్రైవేట్ రంగ మొత్తం ఉత్పత్తి వరుసగా 16 శాతం ఇంకా 28 శాతం మేర పెరగడమే దీనికి నిదర్శనం.
కాగా, ఆపరేషన్ సిందూర్ రక్షణ రంగంలో భారత్ సాధించిన స్వావలంబనకు ఒక డిక్లరేషన్ అని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఛైర్మన్ సమీర్ కామత్ తెలిపారు. అంతేకాదు ఆపరేషన్ సిందూర్ భారత్ వ్యూహాత్మక దూరదృష్టి, స్వదేశీ సాంకేతిక బలాలను ప్రపంచానికి చాటి చెప్పిందని ఆయన పేర్కొన్నారు.
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ) 14వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన కామత్, “పశ్చిమ సరిహద్దుల వెంట అత్యంత సమన్వయంతో భారత్ ఈ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ మల్టీ- డైమెన్షనల్ ఆపరేషన్ భారత సైనికుల ధైర్యసాహసాలనే కాదు, వారికి అండగా నిలిచిన సాంకేతిక మద్దతు గురించి గురించి కూడా ప్రపంచానికి తెలియజేసింది” అని చెప్పారు.
“ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక మిషన్ కాదు. అంతకంటే చాలా ఎక్కువ. ఇది రక్షణ రంగంలో భారత్ సాధించిన స్వావలంబన, వ్యూహాత్మక దూరదృష్టి, స్వదేశీ సాంకేతిక బలం ద్వారా భారతదేశం తన సరిహద్దులను ఉన్నతంగా నిలబెట్టగల సామర్థ్యాన్ని ప్రకటించడం. స్వదేశీ సాంకేతికత ద్వారా భారత్ తన సరిహద్దులను రక్షించుకునే సామర్థ్యం కలిగి ఉందని ప్రపంచానికి చాటి చెప్పడం” అని వివరించారు.
ఆపరేషన్ సిందూర్లో స్వదేశీ తయారీ సెన్సార్లు, మానవ రహిత ప్లాట్ఫారమ్లు, సురక్షిత కమ్యుూనికేషన్ల నుంచి ఏఐ బేస్డ్ సపోర్ట్ సిస్టమ్, ప్రిసిషన్ వెపన్స్ వరకు అన్నీ కీలక పాత్ర పోషించాయని డీఆర్డీఓ చీఫ్ తెలిపారు.
అలాగే ఈ ఆపరేషన్లో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఆకాశ్ క్షిపణులు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్యస్థ-శ్రేణి క్షిపణులు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, డీ4 యాంటీ-డ్రోన్ వ్యవస్థ, ఏడబ్ల్యూఎన్సీ వైమానిక ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ, ఆకాశ్టీర్ వ్యవస్థ పనిచేశాయి. ఇవన్నీ డీఆర్డీఓ అభివృద్ధి చేసినవేనని కామత్ చెప్పారు. ఇందులో డీఐఏటీ వంటి సంస్థలు కూడా కీలకపాత్ర పోషించాయని వెల్లడించారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?