కుల్గాంలో ఇద్దరు జవాన్లు, ముగ్గురు ఉగ్రవాదులు మృతి

కుల్గాంలో ఇద్దరు జవాన్లు, ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తొమ్మిదో రోజు కూడా కొనసాగుతోంది. అఖల్ అడవి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భారత సైనికులు వీరమరణం పొందారు, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇదే సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని సమాచారం. అయితే, ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.

గాయపడిన సైనికులను వెంటనే 92 బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చినార్ కార్ప్స్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అమరులైన సైనికులు లెఫ్టినెంట్ కల్నల్ ప్రీత్‌పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఈ వీరుల సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదు.  ఈ ఘటన కుల్గాం జిల్లాలోని అఖల్ ప్రాంతంలోని దట్టమైన అడవిలో రాత్రి జరిగింది. ఇక్కడ ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. 

కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.  పోలీసులు, సైన్యం ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్‌ను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం డీజీపీ నళిన్ ప్రభాత్ ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆయనతో పాటు ఐజీపీ కశ్మీర్ వీగే విర్ది కూడా ఉన్నారు. అలాగే, నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ దక్షిణ కశ్మీర్ భద్రతపై సమీక్ష నిర్వహించారు.

ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా బలగాలు డ్రోన్‌లు, హెలికాప్టర్లు, ఆధునిక పరికరాలు, శునకాలను ఉపయోగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, తొమ్మిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇది ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో ఎక్కవ సమయం పాటు జరిగిన ఆపరేషన్‌గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అఖల్ ప్రాంతంలోని ప్రజలు ఇంట్లోనే ఉండాలని, ఏవైనా అనుమానాస్పద విషయాలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. సహాయం కోసం సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ఇచ్చారు.