గగనతలాన్ని మూసివేయడంతో పాక్ కు రూ 410 కోట్లు నష్టం

గగనతలాన్ని మూసివేయడంతో పాక్ కు రూ 410 కోట్లు నష్టం
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా భారత్‌ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి విదితమే. న్యూఢిల్లీలో తీసుకున్న ఈ కీలక నిర్ణయం కారణంగా, పాకిస్తాన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి భారీ ఆర్థిక నష్టం సంభవించిందని సమాచారం. పాకిస్తాన్ కూడా భారత్ విమానాలను తమ గగనతలంలోకి అనుమతించకపోవడంతో ఈ నష్టం జరుగుతుంది.

పాకిస్తాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికలు ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నట్టు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ నివేదికల ప్రకారం ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 20 వరకు భారత గగనతలం మూసివేయడంతో, పాకిస్తాన్‌కు రెండు నెలల్లోనే సుమారు రూ 400 కోట్ల నష్టం వాటిల్లింది. భారత్‌ నుంచి వచ్చే విమానాలను ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాకిస్తాన్ తన గగనతలంలోకి అనుమతించడం లేదు. ఈ నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది.

నిజానికి భారత్ నుంచి వెళ్లే అంతర్జాతీయ విమానాలు చాలా వరకు పాకిస్థాన్ గగనతలాన్ని వాడుకుంటాయి. పాక్‌ గగనతలం మీదుగా రోజుకు 100 నుంచి 150 భారతీయ విమానాలు ప్రయాణిస్తుంటాయి.  ఇలా గగనతలాన్ని వాడుకున్నందుకు ఓవర్‌ ఫ్లైయింగ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బోయింగ్ విమానం పాక్ గగనతలం మీదుగా ప్రయాణిస్తే దాదాపు 580 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 

భారత ఆంక్షల కారణంగా రోజువారీ 100 నుంచి 150 విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయని, దాని ఫలితంగా విమాన రాకపోకలు సుమారు 20 శాతం వరకు తగ్గాయని నివేదికలో పేర్కొంది.  పాకిస్థాన్ గగనతలం మూసేయడంతో భారత్ విమానాలు వేరే మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. దీంతో ఆ ఓవర్ ఫ్లయింగ్ ఛార్జీలను పాకిస్తాన్ కోల్పోయింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 మధ్యలో పాకిస్థాన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీకి  రూ.410 కోట్ల నష్టం వాటిల్లింది.

ఈ విషయాన్ని పాక్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అక్కడి అసెంబ్లీలో వెల్లడించినట్లు డాన్‌ నివేదించింది. ఈ ఆంక్షల వల్ల పాకిస్థాన్ ఏడాదికి వేల కోట్ల రూపాయలను కోల్పోతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.