భారత్ నుండి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్‌, వాల్‌మార్ట్‌, టార్గెట్‌

భారత్ నుండి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్‌, వాల్‌మార్ట్‌, టార్గెట్‌
* తయారీ రంగాన్ని దెబ్బతీయ వచ్చన్న మూడీస్‌ 

భారత్‌పై ట్రంప్‌ సుంకాల రెట్టింపు ప్రకటన తర్వాత అమెజాన్‌, వాల్‌మార్ట్‌, టార్గెట్‌, గ్యాప్‌ వంటి ప్రధాన సంస్థలు ఆ దేశం నుండి ఆర్డర్‌లను నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయ వస్తువులపై 50శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ట్రంప్ పెంచిన సుంకాల కారణంగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో అమెరికా ప్రజలపై భారం పెరగనుంది.

తదుపరి నోటీసు వచ్చే వరకు వస్త్రాలు, ఫ్యాషన్‌ ఉత్తతులను నిలిపివేయాలని కోరుతూ అమెరికా సంస్థలు భారత ఎగుమతిదారులకు లేఖలు, మెయిల్స్‌ పంపినట్లు తెలిపాయి.  అదనపు సుంకాల భారాన్ని భారత కొనుగోలుదారులు చెల్లించాలా? లేదా ఎగుమతి సంస్థలు చెల్లించాలా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి వుందని పేర్కొన్నాయి. 

అధిక సుంకాల ఖర్చులను 30 శాతం నుండి 35 శాతం వరకు పెంచవచ్చని, దీంతో ఆర్డర్లు 40 శాతం నుండి 50 శాతం తగ్గే అవకాశం ఉందని, సుమారు 4-5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లవచ్చని తెలిపాయి. భారత్‌లో వెల్స్పన్‌ లివింగ్‌, గోకల్దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఇండో కౌంట్‌, ట్రైడెంట్‌ వంటి ప్రధాన ఎగుమతిదారు సంస్థలు అమెరికా అమ్మకాలతో 40 శాతం నుండి 70 శాతం వరకు లాభాలను ఆర్జిస్తున్నాయి. 

ట్రంప్ విధించిన అదనపు సుంకాల వలన ప్రభావితమయ్యే వస్తువుల్లో దుస్తులు ఒకటి. భారతదేశ వస్త్ర పరిశ్రమను ఈ సుంకాలు గట్టిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికాకు మన దేశం నుంచి ఏటా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన రెడీమేడ్ దుస్తులు ఎగుమతి అవుతాయి. భారత వస్త్రాలు, దుస్తులకు అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం.  మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో మన దేశం 28 శాతం వాటాను కలిగి ఉంది.

దీని మొత్తం విలువ $36.61 బిలియన్లు. ఇప్పుడు భారత్‌పై ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ సుంకాలు పడుతున్నాయి.  బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలపై అమెరికా 20 శాతం మాత్రమే సుంకాలు విధించడంతో ఈ ఉత్పత్తుల కోసం  ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇలా ఉండగా, అధిక సుంకాలు తయారీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చని, ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తాయని మూడీస్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. మార్చి 2026తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వాస్తవ జిడిపి వృద్ధి ప్రస్తుతం అంచనా వేసిన 6.3 శాతంలో నుండి సుమారు 0.3శాతం మందగించవచ్చని తెలిపింది. 

2025 తర్వాత, ఇతర ఆసియా పసిఫిక్‌ దేశాలతో పోలిస్తే చాలా విస్తృతమైన టారిఫ్‌ అంతరం భారతదేశ తయారీ రంగాన్ని ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ వంటి అధిక విలువ కలిగిన రంగాలను అభివృద్ధి చేయాలనే ఆశయానికి తీవ్రంగా నష్టం కలిగిస్తుందని పేర్కొంది. ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంలో గత కొన్నేళ్లుగా సాధించిన కొన్ని లాభాలను కూడా తగ్గించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తే అదే స్థాయిలో చమురు దిగుమతులను పొందడం భారత్‌కు కష్టతరం అవుతుందని కూడా సూచించింది.  పెట్టుబడుల ప్రవాహాలకు ఆటంకం ఏర్పడటంతో దిగుమతుల విలువ పెరిగి లోటు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ రెండు అంశాల దృష్ట్యా చర్చలతో పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నామని మూడీస్‌ తెలిపింది.