
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్‌తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే భారత్ బ్రహ్మోస్ మిస్సైళ్లలో అణ్వాయుధాలను అమర్చవచ్చని అమెరికా ఆందోళనకు గురైనట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ కధనం వెల్లడించింది. ఈ మిస్సైల్స్‌కు అణ్వాయుధాలను జోడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ట్రంప్ జరిపాలన భయపడిందని, బ్రహ్మోస్ క్షిపణికి న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను మోసుకువెళ్లే సామర్థ్యం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయని, ట్రంప్ పరిపాలనలోని ప్రస్తుత, మాజీ అధికారులు సైతం చెప్పినట్లుగా తెలిపింది.
పరిస్థితి మరింత దిగజారితే భారతదేశం ఈ క్షిపణులకు అణ్వాయుధాలను జోడించవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనకు గురయ్యారని, దాంతో పాకిస్తాన్ సైతం అణ్వాయుధాలతో దాడి చేయవచ్చని భావించారని,ఈ భయం కారణంగానే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలను భారత్, పాక్ నేలతో మాట్లాడాలని కోరినట్లు ఆ కధనం తెలిపింది.
బ్రహ్మోస్ క్షిపణిలో సాంప్రదాయ (అణ్వాయుధేతర) ఆయుధాలు మాత్రమే ఉన్నాయని భారత్ గతంలో ఎన్నోసార్లు స్పష్టం చేసింది. వాటిని భారత సైన్యం ఆర్టిలరీ రెజిమెంట్, వైమానిక దళం, నౌకాదళం మాత్రమే మిస్సైల్స్‌ని నిర్వహిస్తన్నాయి. అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్షిపణులు స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్ ఎఫ్ సి) నియంత్రణలో ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణిలో 200 నుంచి 300 కిలోల సాంప్రదాయ పేలుడు పదార్థాలను అమర్చవచ్చు.
ఈ క్షిపణి చాలా ఖచ్చితత్వంతో వేగంగా దాడి చేయగలదు. వాల్ స్ట్రీట్ జర్నల్ కధనం ప్రకారం భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత అణు యుద్ధంగా మారవచ్చని ట్రంప్ ఆందోళన చెందారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, అమెరికా నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వైట్ హౌస్ భావించింది. ట్రంప్ తన వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించి భారతదేశం, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడి సంక్షోభాన్ని నివారించడానికి ప్రయత్నించారని వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కధనం వెల్లడించింది.
అయితే, బ్రహ్మోస్‌ని ప్రయోగించడం వల్లే భయపడ్డారా? లేదా? అన్నది ఆ అధికారి చెప్పలేదని తెలిపింది. వాల్ స్ట్రీట్ జర్నల్ వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ప్రశ్నించిచిన సమయంలో భారత్ ‘మొదట ఉపయోగించకూడదు’ అంటే తొలుత అణు దాడి చేయకూడదు అనే విధానాన్ని అనుసరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. మే పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణ సమయంలో, భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులతో అనేక కీలకమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఆ కధనం పేర్కొంది.
వీటిలో వైమానిక దళ రన్వేలు, బంకర్లు, హ్యాంగర్లు ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశ బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి పెట్టారు. ప్రపంచంలోని ఏకైక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. గంటకు 3450 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ క్షిపణిని 1998లో ప్రారంభమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్‌కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవో మాషినోస్ట్రోయెనియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇప్పుడు భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నారు.
శత్రు నౌకలపై దాడి చేయడం, భూమి, తీరప్రాంత భద్రతను లక్ష్యంగా చేసుకోవడం వంటి వివిధ ప్రయోజనాల కోసం నావికాదళం, వైమానిక దళం, సైన్యం ఉపయోగిస్తున్నాయి. బ్రహ్మోస్‌ను అడ్డుకోవడం చాలా కష్టమే. ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. తొలి దశలో ఘన ఇంధన బూస్టర్ మిస్సైల్ వేగంగా వెళ్లేలా చేస్తుంది. ఆ తర్వాత రామ్‌జెట్ ఇంజిన్ క్రూయిజ్ దశలో పని చేస్తుంది. ఫైర్ అండ్ ఫర్గాట్ వ్యవస్థపై పని చేస్తుంది. టార్గెట్ చేసి ఫైర్ చేసిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉండదు. చాలా త్వరగా దిశను మార్చుకోవడంతో పాటు శత్రువుల రాడార్లను తప్పించుకొని దాడి చేస్తుంది.
More Stories
స్వదేశీ ఉత్పత్తులే కొనండి, అమ్మండి, వినియోగించండి
పైలెట్లను నిందించడం బాధ్యతా రాహిత్యం
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం