గాంధీ కుటుంభం అనుగ్రహం కోసమే ఢిల్లీలో రేవంత్ ధర్నా

గాంధీ కుటుంభం అనుగ్రహం కోసమే ఢిల్లీలో రేవంత్ ధర్నా

రాష్ట్రంలో  రాజకీయంగా వత్తిడి ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం గాంధీ కుటుంభం అనుగ్రహం కోసమే ఢిల్లీలో ధర్నా జరిపినట్లు కనిపిస్తున్నదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 31 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 50 శాతానికంటే ఎక్కువ సమయం, రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని ఆయన తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారని, అయితే దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే అని ఆయన స్పష్టం చేశారు. 

అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టిసారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప అది చేయలేక, బట్టకాల్చి బీజేపీ మీద వేస్తానంటే చూస్తూ ఊరుకోమని కేంద్ర మంత్రి హెచ్చరించారు. చట్టపరమైన, న్యాయపరమైన ప్రణాళిక లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రకటించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ 18 నెలలుగా ఆ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాల అమలు ఊసెత్తడం లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్షకోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారని గుర్తు చేస్తూ,  దీని ప్రకారం ఇప్పటికే కనీసం రూ. 40వేల కోట్లు ఇవ్వాలని, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలని, కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. రజకులు, గౌడ్లు.. ఇలా ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుండా అందరినీ నిట్టనిలువునా మోసం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర అవుతోందని, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టె ప్రయత్నం చేయడం లేదని తెలిపారు. ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప వారికి బీసీలకు సాధికారత కల్పించే విషయంలో చిత్తశుద్ధి లేదనేది తెలంగాణ బీసీ సమాజానికి అర్థమైందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ ధర్నా చేస్తే ఎవరూ పట్టించుకోరని పేర్కొంటూ ఢిల్లీకి వచ్చి పగటివేషాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, ఆర్థిక పరంగా వైఫల్యం ఇలా వరుసగా మీ చేతకాని తనం బయటపడుతుండటంతోనే ఢిల్లీలో ధర్నా చేసి, వాటినుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  ముందుగా అశాస్త్రీయమైన సర్వే చేసి, బీసీల సంఖ్యను తగ్గించారని, ఆ తర్వాత దీనికి 10% ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టే మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుని తీరుతుందని స్పష్టం చేశారు.  ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించదని తేల్చి చెప్పారు.