
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమం ఓ రాజకీయ నాటకమే అని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కొట్టిపారవేసారు. కామారెడ్డిలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారని గుర్తు చేస్తూ కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లను ఏవిధంగా అమలు చేస్తున్నారో ఆయనను అడిగి తెలుసుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు చెప్పారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు పదేపదే బీజేపీపై అభాండాలు వేస్తూ, తమ వైఫల్యాలన్నీ బీజేపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు భేషరతుగా మద్దతు తెలిపారని గుర్తు చేస్తూ ఆ బిల్లులో ముస్లిం రిజర్వేషన్ అంశం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని ప్రయత్నం చేస్తోందని, దీంతో అసలైన బీసీలకు 42 నుంచి 32 శాతానికి పడిపోనున్నాయని రామచందర్ రావు హెచ్చరించారు.
గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చి, బీసీ రిజర్వేషన్లను కుదించిందని, దీనిపై కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉందని చెబుతూ అయితే అందులో కేవలం విద్య, ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, రాజకీయ రిజర్వేషన్ అంశం లేదని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 శాతం రాజకీయ ముస్లిం రిజర్వేషన్లు పెంచి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు రానివ్వకుండా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని కోరుతున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒక ఓబీసీ నాయకుడిని వెంటనే ప్రకటించమని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి చెప్పగలరా అని సవాల్ చేశారు. ఇలా హామీ ఇవ్వకపోతే, రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేస్తున్నట్టే అని స్పష్టం చేశారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు