ఉత్తరాఖండ్‌ లో 28 మంది కేరళ పర్యాటకుల గల్లంతు

ఉత్తరాఖండ్‌ లో 28 మంది కేరళ పర్యాటకుల గల్లంతు

ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు సంభవించిన వేళ 28 మంది కేరళ పర్యటకుల ఆచూకీ గల్లంతైంది. వీరిలో 20మంది మహారాష్ట్రలో స్థిరపడినవారు కాగా, మిగిలిన ఎనిమిది మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ బృందంలోని ఓ జంట బంధువు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

“వారు మాతో మాట్లాడి ఒక రోజు గడిపోయింది. ఉత్తరకాశీ నుంచి ఉదయం ఉదయం 8.30కు గంగోత్రికి బయల్దేరినట్లు వారు తెలిపారు. వారు వెళ్తున్న మార్గంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పటి నుంచి వారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఫోన్‌ కూడా కలవడం లేదు. ఫోన్లలో బ్యాటరీ అయిపోయి ఉండొచ్చు. లేదా వాళ్లు ఉన్న చోట సిగ్నల్ లేదనుకుంటా” అని ఓ బంధువు పేర్కొన్నారు.

హరిద్వార్‌కు చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ 10 రోజులపాటు ఉత్తరాఖండ్‌ పర్యటనకు ఏర్పాటు చేసినట్లు ఆ వ్యక్తి తెలిపారు. అయితే బృందం ఎక్కడ ఉందనే విషయంపై ఏజెన్సీ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.ఇక మంగళవారం మధ్యాహ్నం గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలీలో భారీగా వదలు సంభవించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. 

బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక డజన్ల మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు రెస్క్యూ సిబ్బంది 150 మందిని రక్షించారు. సహాయక చర్యల్లో సైన్యం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పాల్గొన్నాయి. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉత్తరాఖండ్కు విమానంలో తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం హెల్ప్‌లైన్ నంబర్‌లు 01374222126, 01374222722, 9456556431 ఏర్పాటు చేసింది. 

ధరాలిని ముంచెత్తిన జల ప్రళయం నుంచి ఇప్పటివరకూ 250 మంది ప్రజలను రక్షించారు. తొమ్మిది మంది ఆర్మీ జవాన్ల జాడ ఇప్పటికీ తెలియలేదు. భారీ ఎత్తున ఒక పక్క సహాయ కార్యక్రమాలు చేపడుతుంటే, మరో పక్క జాడ తెలియని వారికోసం గాలిస్తున్నారు. సైన్యం, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు, పెద్దఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. 

రోడ్లను క్లియర్ చేసేందుకు భారీ యంత్రాలను హెలికాప్టర్ల ద్వారా రప్పిస్తున్నారు.ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షంతోపాటు ఉధృతంగా వచ్చిన వరదతో కూడిన జలప్రళయం వల్ల కొండచరియలు, మళ్లి పెళ్లలు ముంచెత్తడంతో ధరాలి గ్రామంలో విధ్వంసం జరిగింది. హోటళ్లు, ఇళ్లు, హోమ్ స్టేలతో కూడిన పర్యాటక ప్రాంతాన్ని బురద కమ్మేసింది. ఐదుగురు మరణించగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటికీ వర్షం, మేఘావృతం కావడంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది.