తెలంగాణ రాష్ట్రంలో నడిచేది ఇందిరమ్మ పాలన కాదు, బకాయల పాలన అని బిజెపి ఎమ్యెల్సీ సి. అంజిరెడ్డి విమర్శించారు. గతంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపిటీసీలు, జెడ్పిటీసీలు, కౌన్సిలర్లు తమ ఊరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కాంట్రాక్టులు చేశారని, ప్రస్తుతం సుమారు రూ.600 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబుతూ ఈ రూ.600 కోట్లు తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా, రాష్ట్రంలో 54,000 మంది మధ్యాహ్న భోజనం వండే మహిళలకు నెలకు కేవలం రూ.3,000 మాత్రమే ఇస్తున్నారని, ఆ మొత్తం కూడా ఇప్పటివరకు చెల్లించలేదని విచారం వ్యక్తం చేశారు వెంటనే ఆ మొత్తాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు మధ్యాహ్న భోజనం వండే మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3,000 స్థానంలో నెలకు రూ.5,000 ఇస్తుందని హామీ ఇచ్చారణ, కానీ, గెలిచిన తర్వాత ఇప్పటివరకు నెలకు రూ.3,000 కూడా గత ఏడు నెలలుగా చెల్లించలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల ముందు వీరు ‘ఈఎస్ఐ, పిఎఫ్ కూడా ఇస్తాం’ అని హామీ ఇచ్చారని చెబుతూ కానీ, ఈఎస్ఐ, పిఎఫ్ అమలుకావాలంటే కనీస వేతనం రూ.15,600 ఇవ్వాలని అంజిరెడ్డి స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో ఖర్చులో 60% కేంద్ర ప్రభుత్వానిది కాగా, 40% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిదని పేర్కొంటూ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కనీసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేకపోతుందని విమర్శించారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మెను ప్రకటించారని, దాని అమలుకు అవసరమైన డబ్బులు ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. మెను సరఫరా చేయకపోవడంతో చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని చెప్పారు. చిన్నపిల్లల ఎదుగుదల, చదువు, మధ్యాహ్న భోజనం ఎంతో ముఖ్యం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు భేషరతుగా చెల్లించాలని అంజిరెడ్డి డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీలలో కంప్యూటర్ ఆపరేటర్లుకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని అంజిరెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపల్ అయినా, గ్రామపంచాయతీలు మున్సిపల్‌లో విలీనం అయినా, కార్పొరేషన్లలో ఉన్నా వీరికి కూడా వేతనాలు రావడం లేదని చెప్పారు. గ్రామపంచాయతీ సెక్రటరీలు కూడా అవుట్‌సోర్సింగ్‌గా చేస్తుండగా వారికి కూడా జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో సుమారు 18,000 మంది రేషన్ డీలర్లు ఉన్నారని పేర్కొంటూ వీరికి గతంలో క్వింటాల్‌కు రూ.140 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆ మొత్తం ఇవ్వడంలేదని అంజిరెడ్డి తెలిపారు. ప్రతి నెల రూ.23 కోట్లు అయ్యే ఈ చెల్లింపులు, ఐదు నెలలుగా రూ.115 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గతంలో బిజెపి ధర్నా చేపట్టగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.8,158 కోట్లు బకాయిలు పెండింగ్ లోనే ఉంచుతూ విద్యార్థుల విద్య, భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలు ఆడుతోందని అంజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీలు విద్యార్థులకు, “మీరు ఫీజు కట్టండి లేదా ప్రభుత్వంచి రీయింబర్స్‌మెంట్ తెచ్చుకోండి” అని చెబుతున్నాయని ఆయన తెలిపారు.
బకాయిలు చెల్లించకుండా, పెద్ద పెద్ద కాంట్రాక్టులకు మాత్రం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుండటం దారుణమని అంజిరెడ్డి ధ్వజమెత్తారు. గ్రామపంచాయతీలలో సర్పంచుల పెండింగ్ బకాయిలతో పాటు, ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్‌కి బకాయిలను కూడా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు వరకు రైతుల భూ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ‘భూభారతి’ కార్యక్రమం పెట్టి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు.
More Stories
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్