
ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ బీభత్సానికి నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు దాదాపు 10 మంది సైనికులు వరద నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ ఉండగా, అక్కడ గువన ఉన్న సైనికులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు సమాచారం. దీంతో సైన్యం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
అదే సమయంలో ధరాలీ గ్రామంలో అడుగుల మేర బురద పేరుకుపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది. 150 మంది సభ్యుల బృందం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో కలిసి సహాయక చర్యలు ప్రారంబించింది. నిరాఘాటంగా సహాయ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఎక్కడికక్కడ బురద మేటలు వేయడం, ఇళ్లు, దుకాణాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
ధరాలీ గ్రామంలో సహాయక చర్యలకు చేపట్టేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూడా సిద్ధమైంది. ఛండీగఢ్ ఎయిర్‌బేస్ నుంచి చినూక్ ఎంఐ-17 వీ5, చీతా, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లను స్టాండ్ బైగా ఉంచింది. అక్కడి పరిస్థితుల మేరకు సహాయక చర్యలకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సైనిక హెలికాప్టర్లు బయలుదేరనున్నాయని సమాచారం.
ఉత్తరాఖండ్‌లో వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక దృష్ట్యా చంపావత్, పౌరి, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు అధికారులు. ధరాలీ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఉత్తరకాశీలోని సుఖీ టోప్‌లోనూ మెరుపు వరదలు సంభవించాయి. దీంతో పలు ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లగా మరికొన్ని కొట్టుకుపోయాయి.
వరదకు ధరాలీ గ్రామంలో ఎక్కడ చూసినా అడుగుల మేర పేరుకుపోయిన బురద కనపడుతోంది. ఈ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఆర్మీ క్యాంపు (దిగువ హర్షిల్ ) కూడా కొట్టుకుపోయింది. సమాచారం తెల్సిన వెంటనే సైన్యం వెంటనే రంగంలోకి దిగినా చీకటి పడటంతో సహాయకార్యక్రమాల కొనసాగింపు కష్టంగా మారింది. ఎగువున భారీగా కురుస్తున్న వర్షాలతో ఖీర్ గంగానదికి మంగళవారం మధ్యాహ్నం మెరుపు వరదలు వచ్చాయి.
ఎగువ నుండి ఒక్కసారిగా వచ్చిన బురదతో నిండి ఉన్న ఈ వరద ప్రవాహం సముద్ర మట్టానికి 8,600 అడుగుల ఎత్తున గల ధరాలీ గ్రామం మీద పడింది. ఏం జరుగుతోందో అర్ధమయ్యే లోపే గ్రామస్తులు పలువురు వరదలో కొట్టుకుపోయారు. చాలామంది బురదలో చిక్కుకు పోయారు. ధరాలీ గ్రామానికి పర్యాటకంగా ప్రాధన్యత ఉండటం, పలు గెస్ట్‌హౌస్‌లు,హోటళ్లు కూడా ఉండటంతో టూరిస్టులు ఎవరైనా చిక్కుకుపోయారా అన్న దానిపై స్పష్టత రాలేదు.
వరద ముంచుకువస్తున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కేకలు పెడుతూ, పరిగెత్తుతున్న పలువురి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. గ్రామంలోని హోటళ్లు, ఇళ్లు, మార్కెట్లు అంతా కొట్టుకుపోతున్న దృశ్యాలు వీడియోలలో కనిపించాయి.
ధరాలీ గ్రామంపై వరద ముంచెత్తిన కొద్ది గంటల వ్యవధిలోనే మరో పర్యాటక ప్రాంతమైన సుఖ్‌టాప్ వద్ద కూడా ఇటువంటి పరిస్థితే నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ చోటు చేసుకున్న నష్టంపై పూర్తి వివరాలు తెలియలేదు. దారాలికి సమీపంలోని హార్సిల్ హెలీపాడ్ చుట్టుపక్కల ప్రాంతంలో భారీగా వినాశనం చోటు చేసుకుంది. హర్సిల్ ప్రాంతం కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతమే, ఇక్కడే ఆర్మీ, ఐటిబిపి (ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు) శిబిరాలు కూడా వున్నాయి
2013లో సంభవించిన వరద ఉధృతి కన్నా ఇది చాలా పెద్దదని తెహ్రీ గర్హ్‌వాల్ ఎంపి మాలా రాజ్యలక్ష్మి షా తెలిపారు. వరద పోటెత్తుతుండగా కొంతమంది స్థానికులు తీసిన వీడియో ఫుటేజీ చూస్తుంటే పెద్ద ఎత్తున బురదతో కూడిన వరద ఒక్కసారిగా గ్రామం మీదకు విరుచుకుపడడం కనిపిస్తోంది. ఈ విపత్తు సంభవించిన ప్రాంతానికి కొంచెం దూరంలో వున్నవారు ఫోన్‌కాల్స్ చేసి తమ వారి గురించి ఆరా తీస్తున్నారు.
గాలింపు, సహాయక చర్యలు చేపట్టిన తొలి మూడు గంటల్లోనే దాదాపు 37మందిని కాపాడారు. డెహ్రాడూన్‌లో ఆర్మీ పిఆర్‌ఓ లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గాయపడినవారికి అవసరమైన చికిత్స కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని సిద్ధం చేయాల్సిందిగా సమీపంలోని ఆస్పత్రులను కోరినట్లు చెప్పారు. పడకలు, ఆక్సిజన్, మందులు ఇతర అత్యవసరాలతో సిద్ధంగా వుండాల్సిందిగా వైద్య బృందాలను ఆదేశించారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!