తెలంగాణ ప్రజలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు

తెలంగాణ ప్రజలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు

తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ అవినీతి పాలనను చూసారని, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనను కూడా చూశారని చెబుతూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేయలేదని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయలేదని విమర్శించారు. 
 
గతంలో బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో మాత్రమే బిజెపి ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేసిందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి నిరంతరం పోరాటం చేసిందని, అయితే  ఆ పోరాటాల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పొంది అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలు బిజెపి ని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన యాతన అనుభవిస్తున్నారని రామచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయం చేసేవారు అధికంగా ఉన్నారని చెబుతూ కేంద్ర ప్రభుత్వం అవసరానికి మించిన ఎరువులను రాష్ట్రానికి అందిస్తోందిని, ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు.

2024–25 రబీ సీజన్‌లో రాష్ట్రానికి అవసరమైన యూరియా పరిమాణం 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేంద్రం 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని, అయినా కూడా రాష్ట్రంలో ఎరువులు బ్లాక్ మార్కెట్‌కి చేరుతున్నాయని బీజేపీ నేత మండిపడ్డారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతోందని ధ్వజమెత్తారు. ఎరువుల దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని పేర్కొంటూ మానిటరింగ్ లేకపోవడం, వ్యవసాయ శాఖ అలసత్వం, బ్లాక్ మార్కెట్‌ నిరోధించడంలో విఫలమవడం ప్రధాన కారణాలని విమర్శించారు. బ్లాక్ మార్కెట్‌కు ప్రోత్సాహం ఇస్తూ దళారులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని రామచందర్ రావు ఆరోపించారు.

రైతులకు యూరియా కొరత తీరేందుకు రూ. 6300 కోట్ల వ్యయంతో కేంద్రం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించిందని గుర్తు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు రూ. 20 వేల కోట్ల అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి జిల్లాను వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పింది గాని,  గత 19 నెలల పాలనలో ఈ జిల్లాను పూర్తిగా విస్మరించిందని బీజేపీ నేత విమర్శించారు.