వడ్డీరేట్లను యథాతథంగా ప్రకటించిన ఆర్‌బీఐ

వడ్డీరేట్లను యథాతథంగా ప్రకటించిన ఆర్‌బీఐ
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యధాతథంగా 5.5 శాతం వద్ద భారత రిజర్వ్ బ్యాంక్​ ఉంచింది. అంతా ఊహించినట్లుగానే ఆగస్టు పాలసీ సమావేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ అదే నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడుసార్లు వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత ఈసారి ఆలోచించి అడుగులు వేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు.

ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలను సంజయ్ మల్హోత్రా బుధవారం ప్రకటించారు. ఆ సమయంలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదని అన్నారు. ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ టారిఫ్‌లపై అనిశ్చితులు ఇంకా తొలగలేదని తెలిపారు. అందుకే రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

స్థిర విధాన వైఖరిని కమిటీ మరింత కాలం కొనసాగించనున్నట్లు కూడా ఆర్​బీఐ గవర్నర్​  సంజయ్​ మల్హోత్రా పేర్కొన్నారు.  ప్రస్తుత ఏడాదిలో ఆర్‌బీఐ రెపో రేటును 1 శాతం తగ్గించింది. ఫిబ్రవరి నెలలో రెపో రేటును 0.25 శాతం తగ్గించగా, ఏప్రిల్ నెలలో కూడా మరో 0.25 శాతం తగ్గించింది. జూన్ పాలసీ సమావేశంలో 0.50 శాతం తగ్గించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు యథాతథంగా ఉంచింది.

మరోవైపు, ఎంపీసీ నిర్ణయాలను ప్రకటించే సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌ పలు విషయాలు మాట్లాడారు. రుతుపవనాలు సమృద్ధిగా కొనసాగుతున్నందున ఆర్థిక వ్యవస్థలో నూతన ఉత్సాహం రానుందని తెలిపారు. సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదవుతుండటంతో ద్రవ్యోల్బణం మరింత దిగిరానుందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వనుందని తెలిపారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదవ్వొచ్చని అంచనా వేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి బలమైన ఆటంకం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థిరంగా 4శాతం వద్దే ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.1 శాతం వరకు దిగిరావచ్చని కూడా అంచనా వేశారు. వ్యవస్థలో ద్రవ్యలభ్యత మిగులు స్థాయిలోనే ఉందని తెలిపారు.