
1994లో బిజెపి రాజ్యసభ సభ్యుడు సి. సదానందన్ మాస్టర్ పై జరిగిన దాడిలో ఆయన రెండు కాళ్ళు కోల్పోయిన కేసులో దోషులుగా తేలిన ఎనిమిది మంది పార్టీ కార్యకర్తలకు వారో పెద్ద ఘనకార్యం చేసినట్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) బహిరంగ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడంతో కేరళలో వివాదం చెలరేగింది. తలస్సేరి కోర్టు ప్రాంగణంలో, తర్వాత కన్నూర్ లోని మట్టనూర్ లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
హాజరైన వారిలో మట్టనూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి కె.కె. శైలజ కూడా ఉన్నారు. నిందితులకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నట్లు చూపించే వీడ్కోలు కార్యక్రమం నుండి వచ్చిన వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎనిమిది మంది నిందితులు, అందరూ సిపిఎం కార్యకర్తలు, 30 సంవత్సరాల తర్వాత సోమవారం తలస్సేరి కోర్టు ముందు లొంగిపోయారు.
ట్రయల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ వారి అప్పీళ్లను విచారించేలోపు బెయిల్‌పై బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు ఇటీవల వారి అప్పీల్‌ను తోసిపుచ్చింది, దీనితో లొంగిపోయారు. వీడ్కోలు వీడియోలను చూస్తే దోషులుగా తేలిన సిపిఎం కార్యకర్తలను నేరస్థులుగా కాకుండా యుద్ధం నుండి తిరిగి వస్తున్న వీరులుగా చూస్తున్నట్లు చూపిస్తున్నాయి.
కేరళ హైకోర్టు వారిపట్ల ఎటువంటి సానుభూతిని వ్యక్తం చేయడానికి 1994 దాడిని “ముందస్తు ప్రణాళిక” మరియు “తీవ్ర ఖండించదగినది” అని పేర్కొంది.
పైగా, “ఈ సంఘటన ఆవేశంలో లేదా ఆకస్మిక రెచ్చగొట్టడం వల్ల జరగలేదు. ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తోంది. నిందితులు ఎలాంటి క్షమాభిక్షకు అర్హులు కాదు” అని స్పష్టం చేసింది.
మరోవంక, హైకోర్టు పరిహారాన్ని కూడా పెంచింది. దోషులు ప్రతి ఒక్కరూ బాధితుడికి రూ. 50,000 చెల్లించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు వారి చివరి పిటిషన్‌ను స్వీకరించడానికి నిరాకరించిన తర్వాత, హైకోర్టు వారి బెయిల్‌ను రద్దు చేసి ఆగస్టు 4 నాటికి లొంగిపోవాలని ఆదేశించింది. ఈ సంఘటనపై స్పందిస్తూ, సి. సదానందన్ మాస్టర్ ఈ కార్యక్రమాన్ని “దురదృష్టకరం” అని అభివర్ణించారు. ఇది సమాజానికి ప్రమాదకరమైన సందేశాన్ని పంపిందని హెచ్చరించారు.
“ఖచ్చితంగా, విచారకరంగా ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే జైలుకు వెళ్లిన దోషులకు ఇచ్చిన వీడ్కోలు. ప్రతి కోర్టు దోషులుగా నిర్ధారించిన ఈ వ్యక్తులకు వీడ్కోలు పలికే కార్యక్రమం మట్టనూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.కె. శైలజ టీచర్ నాయకత్వంలో జరిగింది. వారు వీడ్కోలు పలికి నినాదాలు చేశారు. అది వారి పార్టీ విషయం” అని ఆయన తెలిపారు.
“అయితే నా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అయిన ఎమ్మెల్యేగా, శైలజ టీచర్ దీనికి నాయకత్వం వహించారు. ఇది దురదృష్టకరం సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది, ”అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఇటువంటి క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నప్పుడు, నాయకులు వారిని ప్రోత్సహించకుండా సరిదిద్దడానికి ప్రయత్నించాలని ఆయన హితవు చెప్పారు.
“శైలజ టీచర్ అనుసరించిన ఈ విధానం నిజంగా బాధాకరం” అని సదానందన్ స్పష్టం చేశారు. 1994లో కన్నూర్‌లోని సదానందన్ మాస్టర్ ఇంటి సమీపంలో దాడి జరిగింది. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్, సిపిఐఎం మధ్య తీవ్రమైన రాజకీయ వైరం ఉంది. అప్పుడు 30 సంవత్సరాల వయసున్న మాస్టర్ ఆర్‌ఎస్‌ఎస్ బౌధిక్ ప్రముఖ్‌గా పనిచేస్తున్నారు. స్థానిక ఎల్‌పి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు.
తన సోదరి వివాహం కోసం బంధువులను సందర్శించి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. హింస ఆయనను శాశ్వతంగా వికలాంగుడిని చేసింది. ఈ సంఘటన జరిగినప్పటికీ, సదానందన్ మాస్టర్ ప్రజా జీవితంలో చురుకుగా ఉన్నారు. తాజాగా ఆయనను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు. బిజెపి తరచుగా ఆయనను పార్టీ కోసం “జీవన అమరవీరుడు”గా అభివర్ణిస్తుంది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం