అవినీతి కేసు నుంచి మాజీ మంత్రికి విముక్తి

అవినీతి కేసు నుంచి మాజీ మంత్రికి విముక్తి

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ కు భారీ ఊరట లభించింది.  అవినీతి ఆరోపణల కేసులో మూడేళ్ల క్రితం ఆరెస్ట్ అయిన ఆయనకు సోమవారం కోర్టు క్లీన్‌చీట్ ఇచ్చింది. తగిన ఆధారాలను సమర్పించడంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విఫలమైందని తెలిపిన కోర్టు కేసును కొట్టివేసింది.  దాంతో, కొన్నాళ్లుగా అవినీతి కేసులో జైలు పాలైన ఆయనకు విముక్తి దొరికింది.

సీబీఐ అరెస్ట్ చేసే సమయానికి సత్యేంద్ర ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) మంత్రిగా ఉన్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా నియమాకాలు చేపట్టారని సీబీఐ ఆయనపై అభియోగాలు మోపింది.  2018లో ఆయనపై కేసు నమోదైంది. అవినీతి నిరోధక చట్టం – 1988 కింద ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 

దాంతో, సత్యేంద్ర న్యాయపోరాటం చేశారు. సీబీఐ సమర్పించిన తుది నివేదికను పరిశీలించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి డిగ్ వినయ్ సింగ్ మాజీ మంత్రి దోషి కాదని చెప్పారు. ఆయనపై చేసిన ఆరోపణలను నిజమన భావించేలా సాక్ష్యాధారాలను సమర్పించడంలో సీబీఐ విఫలమైందని.. అవినీతి కేసును కొట్టేపారేశారు జడ్జి.

“సత్యేంద్ర జైన్‌పై నమోదైన అవినీతి కేసులో సీబిఐ సమర్పించిన తుది నివేదిక, ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించాం. అయితే ఆయనను దోషిగా తేల్చేందుకు అవసరమైన తగిన ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమైంది. ఎవరినైనా అర్టెస్ చేయాలంటే అనుమానం ఉంటే సరిపోదు. తదుపరి చర్యలకు నేరానికి పాల్పడ్డారని అనడానికి బలమైన ఆధారాలు ఉండాలి” అని కోర్టు తెలిపింది