
వృందావన్‌లోని శ్రీ బంకి బిహారీ ఆలయం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ శ్రీ కృష్ణ భగవానుడు తొట్టతొలి మధ్యవర్తి అని, ఆయన అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నది. బంకి బిహారీ ఆలయానికి చెందిన రూ. 500 కోట్ల నిధులతో రీడెవలప్మెంట్ పనులు చేపట్టాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్నది. ఆ కేసులో సుప్రీంకోర్టు వాదనలు విన్నది.
శ్రీ కృష్ణుడు తొలి మీడియేటర్ అని, ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ ట్రస్టు మధ్య ఉన్న వివాదం పరిష్కారం కోసం కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఆలయ నిదులను రహస్య వినియోగించే పద్ధతిని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఈ అంశంలో యూపీ సర్కారు వైఖరిని కోర్టు తప్పుపట్టింది.
జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్చి ఈ ప్రతిపాదన చేశారు. ఆలయ నిధులను వాడుకోవాలని మే 15వ తేదీన ఇచ్చిన తీర్పును ఉపసంహరించు కోవాలని సుప్రీం తెలిపింది. గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నామని కోర్టు చెప్పింది. ట్రస్టీ సభ్యుల్లో మాజీ హైకోర్టు జడ్జీ లేదా సీనియర్ రిటైర్డ్ న్యాయవాది ఉంటారని పేర్కొన్నది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆలయ పరిపాలనను ప్రభుత్వం నియమించిన ట్రస్ట్‌కు అప్పగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌పై చట్టపరమైన సవాలును లేవనెత్తారు. ధర్మాసనం ఈ విషయాన్ని విచారణకు స్వీకరించి, లక్షలాది మంది భక్తులు సందర్శించే ఆలయాన్ని `ప్రైవేట్’గా పరిగనింపలేమని పేర్కొంటూ ఆలయ స్వభావం, దాని నిర్వహణపై బలమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
శ్రీ బాంకే బిహారీ ఆలయం ఒక ప్రైవేట్ మత సంస్థ అని, ప్రభుత్వ ఆర్డినెన్స్ పరోక్ష ప్రభుత్వ నియంత్రణకు సమానమని పిటిషన్లు వాదిస్తున్నాయి. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ మాట్లాడుతూ, ఆలయ నిర్వహణ సంస్థ అనుమతి లేకుండా ప్రభుత్వం భూమిని కొనుగోలు చేయడానికి , అభివృద్ధి పనులను నిర్వహించడానికి ఆలయ నిధులను ఉపయోగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈ వాదనను ప్రతిఘటిస్తూ, జస్టిస్ సూర్యకాంత్, “లక్షలాది మంది భక్తులు సందర్శించే మతపరమైన స్థలాన్ని మీరు ప్రైవేట్ ఆలయం అని ఎలా పిలుస్తారు? దేవత ప్రైవేట్‌గా ఉండకూడదు. నిర్వహణ మాత్రమే ప్రైవేట్‌గా ఉంటుంది” అని స్పష్టం చేశారు. ఆలయ నిధులు ఆలయ అభివృద్ధికి ఉపయోగించకుండా వ్యక్తుల జేబుల్లోకి ఎందుకు వెళ్లాలని ధర్మాసనం ప్రశ్నించింది. “ప్రభుత్వం ఆలయ డబ్బును దోచుకోవాలని భావిస్తున్నట్లు కనిపించడం లేదు. వారు దానిని అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు” అని కోర్టు వ్యాఖ్యానించింది.
కమిటీ ఆదేశాల మేరకు ఆలయ వ్యవహారాలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది. బంకి బిహారీ ఆలయ పునరుద్దరణ కోసం వినియోగించే నిధులపై తాత్కాలిక కమిటీకి అవకాశం ఇవ్వనున్నట్లు కోర్టు వెల్లడించింది. బంకి బిహారీ ఆలయాన్ని 1862లో నిర్మించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు ఆ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. షిబాయితీలు ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.
వారసత్వ పురోహితులు అక్కడ పూజలు, నిర్వహణ చేస్తున్నారు. 2022 జన్మాష్టమి వేడుకల వేళ తొక్కిసలాట ఘటన జరిగింది. దీంతో అక్కడ ఆలయ పునరుద్దరణ చేపట్టాలని డిమాండ్ వచ్చింది. భక్తుల తాకిడీని తగ్గించేందుకు, రక్షణ చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని యూపీ సర్కారును 2023 సెప్టెంబర్‌లో అలహాబాద్ కోర్టు ఆదేశించింది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు