
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వేసిన జస్టిన్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను త్వరలో తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించినట్లు మీడియాసమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతూ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే రిపోర్టుపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.
శాసన సభలో చర్చ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తామన్న సీఎం జస్టిస్ ఘోష్ కమిషన్ సూచనల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్న ఆయన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని సలహాలు, సూచనలను ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని తెలిపారు.
ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని కమిషన్ స్పష్టంగా తెలియజేసిందని సీఎం రేవంత్ వెల్లడించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజాప్రతినిధులు, ఐఎస్‌ఎస్లు, ఇంజినీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు చెందిన నిపుణులు విశ్లేషాత్మకంగా నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ నివేదిక రాజకీయ పార్టీలు ఇచ్చింది కాదని స్పష్టం చేశారు. ఎవరిపైనా కక్షసాధింపులు, వ్యక్తిగత ద్వేషం తమ ఉద్దేశం కాదనే పూర్తి వివరాలను మీడియా ముందు ఉంచినట్లు పేర్కొన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరిట కేసీఆర్ మార్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ప్రాజెక్టులు నిర్మించారని, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి సాగునీళ్లు ఇస్తామని ప్రాజెక్టు చేపట్టారని, 2015-16లో ప్రారంభించిన పనులు 2018-19లో పూర్తి చేసినట్లు గత ప్రభుత్వమే చెప్పిందని ఆయన తెలిపారు. నిర్మాణం జరిగిన మూడేళ్లలోపే అంటే 2023లో మేడిగడ్డ కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పగుళ్లు వచ్చాయని దుయ్యబట్టారు.
ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని సాంకేతిక నిపుణులు, ఎన్‌డీఎస్‌ఏ గుర్తించాయని, విచారణ చేసి ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలున్నట్లు గుర్తించారని సీఎం రేవంత్ తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నివేదికలు ఇచ్చారని, ఆనాడు ప్రతిపక్ష పార్టీ పక్షాన భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్‌బాబు ప్రాజెక్టుల పర్యటనలు చేపట్టినట్లు గుర్తుచేశారు. లోపభూయిష్ట నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్య వైఖరి గుర్తించామన్న ఆయన రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విచారణకు ఆదేశిస్తామని గతంలో చెప్పామని జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ వేసినట్లు గుర్తుచేశారు. నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీశ్ రావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్లతో కమిషన్ మాట్లాడిందని పేర్కొన్నారు. ఐఏఎస్‌లు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు, ప్రజా సంఘాలతో కూడా కమిషన్ మాట్లాడినట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలు విశ్లేషించి 660 పేజీలతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై ముగ్గురు అధికారులతో కమిటీ వేసినట్లు తెలిపారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!