ఐదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత

ఐదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత
2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.7.08లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.1.79లక్షల కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌  మోసాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.ఆర్థిక సహాయ మంత్రి పంక్‌ చౌదరి లోక్‌సభలో వివరాలను వెల్లడించారు.  డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షలకోట్లకుపైగా జీఎస్టీ ఎగవేతను సీజీఎస్‌టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారని, 2025 ఆర్థిక సంవత్సరంలో 30,056 జీఎస్టీ ఎగవేత కేసులను గుర్తించినట్లు ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఇందులో సగానికిపైగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు సంబంధించినవే ఉన్నాయని పేర్కొంది. 
 
ఈ కేసుల్లో రూ.58,772 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత, 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రూ.1.32లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించారని, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.73,238కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.49,384 కోట్ల జీఎస్టీ ఎగవేత జరిగిందని అధికారులు గుర్తించారు. 
 
గడిచిన ఐదేళ్లలో సీజీఎస్టీ ఫీల్డ్‌ అధికారులు రూ.91,370 కేసుల్లో దాదాపు రూ.7.08 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు గుర్తించారన్నారు. ఈక ఆలంలో స్వచ్ఛంద డిపాజిట్ల ద్వారా వసూలు చేసిన పన్నులు రూ.1.29 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి.  2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య 44,938 కేసుల్లో దాదాపు రూ.1.79 లక్షల కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పన్ను ఎగవేత వేసినట్లు కేంద్రం తెలిపింది. 
 
కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీఎన్‌ పన్ను ఎగువేతను నివారించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి చౌదరి లోక్‌సభలో తెలిపారు. ఈ-ఇన్వాయిస్ ద్వారా డిజిటలైజేషన్, జీఎస్టీ రివ్యూ తదితర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ పన్ను ఎగవేతదారులను పట్టుకోవడంలో సహాయపడుతాయని చౌదరి లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 
 
సవరించిన అంచనాలతో పోలిస్తే వాస్తవ నికర కేంద్ర జీఎస్టీ వసూళ్లపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర సీజీఎస్టీ వసూళ్లు సవరించిన అంచనాలలో 96.7 శాతమని చౌదరి తెలిపారు. నికర సీజీఎస్టీలో సీజీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, పరిహార సెస్ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.  2025 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ వసూళ్లు రూ.10.26 లక్షల కోట్లకుపైగా ఉండగా, సవరించిన అంచనాలు దాదాపు రూ.10.62 లక్షల కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో నికర సీజీఎస్టీ వసూళ్లు రూ.9.57 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. సవరించిన అంచనాలు రూ.9.56 లక్షల కోట్లలో 100.1శాతం.