ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మోదీ చలవే!

ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మోదీ చలవే!
ప్రధాని నరేంద్ర మోదీ పథకాలే ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెబుతూ  ఏపీలో జరిగే ప్రతి అభివృధి కార్యక్రమం మోదీ  చలవే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. రైతులకు, మహిళలకు పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొంటూ నేడు ప్రపంచం మొత్తం మోదీ  వైపు చూస్తున్నారని తెలిపారు.  గుంటూరులో జరిగిన బిజెపి జిల్లా కార్యకర్తల విస్తృత సమావేశంలో మంగళవారం ప్రసంగిస్తూ సోలార్ పథకం మోదీ వరమే అని పేర్కొంటూ మోదీ ఓ వ్యక్తి కాదని, దేశ ఆత్మ స్వరూపం అని కొనియాడారు.
దేశ గౌరవం ప్రపంచం మొత్తంలో పెంచింది మోదీ అని చెబుతూ ప్రపంచం లో ఏ మూలకు వెళ్లినా భారత్ పౌరుల గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో పెహల్గం లో మారణ కాండ చేసిన వారిని తుదముట్టించామని,  పాకిస్తాన్ కి నరకం పరిచయం చేశామని గుర్తు చేశారు. అందుకు  ఉపకరించిన మన బ్రహ్మోస్ మిస్సయిల్ రూ. 30 వేల కోట్లుతో కొనుగోలు చెయ్యడానికి ప్రపంచ దేశాలు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు 
 
బీజేపీ పెద్ద పార్టీ అని ఎందరో బలిదానాలతో బీజేపీ ఆవిర్భవించిందని చెబుతూ  భారత్ త్రివర్ణ పతాకం  ప్రతి గ్రామంలో ఎగర వెయ్యాలని, ప్రతి కాలనీ లోని ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని పిలుపిచ్చారు. కూటమి నేతలు గౌరవం పొందాలంటే అంటే ప్రజలకు సేవ చెయ్యాలని చెప్పారు. ప్రతి వార్డులో బీజేపీ నేతలు పోటీ చెయ్యాలని, ప్రజా సమస్య ల పై ప్రతి కార్యకర్త పని చెయ్యాలని సూచించారు. అప్పుడే పార్టీ ఎదుగుతుందని చెప్పారు.  జిల్లా పార్టీ కార్యాలయం కేంద్ర పధకాలు అందే కార్యక్షేత్రం గా మారాలని,   ప్రజలకు- అధికారులకు మద్య వారధిగా బీజేపీ కార్యకర్తలు మారాలని మాధవ్ తెలిపారు.
కాగా, గుంటూరులోని జిన్నా టవర్ లా అనేక ప్రాంతాలో బ్రిటీష్ పాలకుల హయాంలో పెట్టిన పేర్లు భారత మూలాలు ఉండేలా మారుస్తామని మాధవ్ ప్రకటించారు.   చాయ్ పై చర్చా కార్యక్రమంలో భాగంగా గుంటూరు అరండల్ పేటలోని పుండరీ కాంక్షయ్య పార్క్ దగ్గర లోని ఒక హోటల్ ముందు మాధవ్ మాట్లాడుతూ వైజాగ్ లోని కింగ్ జార్జ్ పేరు కూడా అలాంటిదే అని చెప్పారు. 
 
దేశ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షేంచేలా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.  అమృతకాలంలో దేశంలోని బానిస చిహ్నాలు ఏమున్నాయో వాటిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ గుంటూరులో జిన్నా టవర్స్ పేరును కూడా మార్చుతామని స్పష్టం చేశారు.  మతం అనేది ఎవరి ఇష్టం వాళ్ళదే అని చెబుతూ `నేను జైశ్రీరామ్ అంటాను.  మిగతావాళ్లు వాళ్ళ మతాన్ని స్మరించుకోవాలి. దాన్ని అందరూ గౌరవించాలి’ అని పేర్కొన్నారు.