ఉత్తరాఖండ్‌లో జలప్రళయం‌.. 60 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం‌.. 60 మంది గల్లంతు
* జలప్రవాహం విరుచుకుపడటంతో కొట్టుకుపోయిన ధారళి గ్రామం

ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీని వరదలు ముంచెత్తాయి. ధారళి గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. దీనితో ఆ గ్రామంలో చాలా భాగం కొట్టుకుపోయింది. వరదల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందగా,60 మందికి పైగా గల్లంతు అయ్యారని స్థానికులు చెబుతున్నారు. వరదల ధాటికి 20-25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండొచ్చని వారు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఖీర్‌ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆకస్మిక వరదలు సంభవించాయి.  వరదల వల్ల ఇప్పటికే అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. చాలా మంది ప్రజలు జలదిగ్భందంలో ఉన్నారు. పరిస్థితి భయానకంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.  ‘ఉత్తరకాశీలోని హర్సిల్ ప్రాంతంలోని ఖీర్​గఢ్​లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీనితో పోలీసులు, ఎస్​డీఆర్​ఎఫ్, సైన్యం సహా విపత్తు ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయని’ పోలీసులు తెలిపారు. 

మరో వైపు సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఆకస్మిక వరదల ధాటికి ధరాలి గ్రామంలో చాలా భాగం కొట్టుకుపోయింది. గంగోత్రి ధామ్​ యాత్రికుల మార్గంలో ఉన్న ఈ గ్రామంలో వరదలు ఉప్పొంగి ప్రవహించడంతో ఇళ్లు, దుకాణాలు, మౌలిక సదుపాయాలు అన్నీ కొట్టుకుపోయాయి.  ఓ స్థానికుడు చెప్పిన వివరాల ప్రకారం, ‘సుమారు 10-12 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. బహుశా వీరు చనిపోయి ఉండవచ్చు’.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో సదరు గ్రామస్థులు భయంతో కేకలు వేస్తూ, ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.  మరోవైపు ఉత్తరకాశీలో బార్కోట్ తహసీల్​లోని బనాలా పట్టి ప్రాంతంలో కుడ్​ గధేరా వాగు పొంగిపొర్లడంతో దాదాపు 18 మేకలు కొట్టుకుపోయాయి. అంతేకాదు అనేక మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. 

మరోవైపు గంగోత్రికి వెళ్లే మార్గం భారీ వరదల కారణంగా కొట్టుపోయింది. దీంతో ఆ ప్రాంతంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. అదీకాక పర్వత ప్రాంతాలపై కురిసిన భారీ వర్షం వరదగా మారి జనవాసాలను ముంచెత్తాయి. దీంతో పలు ఇళ్లు  ఆ ప్రవాహా దాటికి కొట్టుకుని పోగా.. భారీ వృక్షాలు సైతం నెలకూలాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​సింగ్ ధామితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఫోన్​లో మాట్లాడారు.​ వరదల ధాటికి ధరాలి గ్రామంలో జరిగిన భారీ విధ్వంసం గురించి మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల కోసం ధరాలికి వెళ్లాలని ఎన్​డీఆర్​ఎఫ్​, ఐటీబీపీ బృందాలను ఆదేశించారు.

ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన జలప్రళయంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. `ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామాన్ని వరదలు ముంచెత్తడం విచారకరం, బాధితులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని చెప్పారు.

ధరాలి ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో సీనియర్‌ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ధరాలీ వార్త చాలా బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, జిల్లా యంత్రాంగం సహా సంబంధిత అధికార బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.  ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని చెప్పారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్​లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందే హెచ్చరికలు జారీ చేసింది. దీనితో స్థానికులు, పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.

అలాగే పొరుగునున్న హిమాచల్ ప్రదేశ్‌లో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 310 రహదారులతోపాటు పలు జాతీయ రహదారులను మూసివేశారు. దీంతో రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షకాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో 103 మంది మరణించారు. అలాగే 36 మంది గల్లంతయ్యారని అధికారికంగా ప్రభుత్వం గణాంకాలను వెల్లడించింది.