తెలంగాణకు మరో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు

తెలంగాణకు మరో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు

ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు రక్షణ, వ్యవసాయ, బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ ఇకపై కీలకమైన క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు వేదిక కానుంది. క్రిటికల్ మినరల్స్ పై పరిశోధలనకోసం దేశవ్యాప్తంగా 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, అందులో రెండు తెలంగాణకు కేటాయించారు. 

క్రిటికల్ మినరల్స్ సంపదను పెంచుకోవడం ద్వారా క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ ట్రాన్సిషన్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, స్పేస్ తదితర రంగాల్లో కీలకమైన ప్రగతిని సాధించేందుకు వీలుకలుగుతుంది. అందుకే ఈ ఏడాది జనవరిలో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ.16,300 కోట్ల బడ్జెట్‌ కేటాయించడంతో పాటుగా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మరో రూ.18 వేల కోట్లను సేకరించి ఈ మిషన్ ను ముందుకు తీసుకెళ్లనున్నారు.

ఈ మిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటుచేయాలని కేంద్ర గనుల శాఖ నిర్ణయించింది. ఇందులో 4 ఐఐటిలు , 3 ఆర్&డి (రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్) కేంద్రాలున్నాయి. నాలుగు ఐఐటిలలో ఐఐటి  హైదరాబాద్, ఐఐటి బాంబే, ఐఐటి-ఐఎస్ఎం  ధన్‌బాద్, ఐఐటి రూర్కీ లు ఉండగా,3 ఆర్&డి సెంటర్లలో భువనేశ్వర్ లోని సిఎస్ఐఆర్-ఐఎంఎంటి,  జంషెడ్‌పూర్ లోని సిఎస్ఐఆర్ – ఎన్ఎంఎల్ లతోపాటుగా హైదరాబాద్ లోని నాన్-ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎన్ఎఫ్ టిడిసి) ఉన్నాయి.

ఇవి కాకుండా ఆర్ & డికోసం రూ.500 కోట్లు, అంతర్జాతీయ స్థాయి మానవ వనరుల అభివృద్ధి కోసం మరో రూ.500 కోట్లు ఇవ్వనున్నారు. ఇటీవలి కాలంలో ఐఐటి హైదరాబాద్ శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనల విషయంలో విశేషమైన ప్రగతిని కనబరుస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుని పరిశోధనలను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా, 7 మార్చ్, 2025 నాడు సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో ఏర్పాటు కోసం కోలిండియాతో ఒప్పందం చేసుకుంది.

ఎన్ఎఫ్ టిడిసి కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశోధనల్లో విప్లవాత్మక సంస్కరణలతో ముందుకెళ్తోంది. చిన్న సైజు లో ఉండి సమర్థవంతంగా పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధి కోసం ఆల్టర్ మాగ్నెట్స్ ను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఫిజిక్స్, మెడికల్ ఇమేజింగ్, నేవిగేషన్ తోపాటుగా వివిధ రంగాల్లో అవసరమయ్యేలా సరికొత్త మ్యాగ్నెటోమెట్రీ విధానాన్ని కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర సాంకేతికత లకు అవసరమయ్యే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కూడా ఈ కేంద్రం ద్వారా అభివృద్ధి చేయబడుతున్నాయి.