
* ‘మీరు నిజమైన భారతీయులైతే సైన్యం గురించి అలా మాట్లాడరు’
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. “మీరు ప్రతిపక్ష నేత. పార్లమెంటులో చెప్పాల్సిన విషయాలను సోషల్ మీడియాలో ఎందుకు ప్రస్తావిస్తారు? 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని మీకు ఎలా తెలుసు?” అని రాహుల్ గాంధీని ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022 డిసెంబర్‌లో గల్వాన్ ఘర్షణలపై మాట్లాడారు. గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఓ రిటైర్డ్ రక్షణ అధికారి లక్నో కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
“2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు. మీరు అక్కడ ఉన్నారా? ఏవైనా విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయా? మీరు నిజమైన భారతీయులైతే, భారత సైన్యం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత. మీరు ఏదైనా చెప్పాలంటే పార్లమెంటులో మాట్లాడాలి. సోషల్ మీడియా పోస్టులలో చెప్పకూడదు.” అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇది ఢిల్లీ వైశాల్యం కంటే ఎక్కువని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరని రాహుల్ విమర్శించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని తిరిగి ఇవ్వాలంటూ మన సైన్యం చైనా సైన్యంతో చర్చలు జరిపినప్పటికీ ప్రధాని మోదీ ఈ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
ప్రధాని మోదీ అసలు ఆక్రమణే జరగలేదంటున్నారని, దీని గురించి దేశ మీడియా ప్రశ్నించడం లేదని రాహుల్ విమర్శించారు. ఈ మేరకు రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. అలాగే రాహుల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశ సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీపై న్యాయస్థానంలో లఖ్‌నవూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో భారత సైన్యం గురించి రాహుల్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
తనపై దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేశారని కోర్టుకు తెలియజేశారు. అయితే అలహాబాద్ హైకోర్టు రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సోమవారం రాహుల్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం లక్నో కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధిస్తూ రాహుల్ గాంధీకి తాత్కాలిక ఊరటనిచ్చింది. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మాత్రం మాత్రం తీవ్రంగా తప్పుబట్టింది. జాతీయ నాయకులు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం