
బీహార్ లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరు లేదని ఆరోపించడం ద్వారా బీహార్ లో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. తన ఓటర్ ఐడీ కార్డు నంబర్‌తో ఆన్లైన్లో వెతికానని, తన గుర్తింపు సంఖ్య మార్చేశారని ఆరోపించారు.
“నా పేరు ఓటరు జాబితాలో లేదు. నేను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి?” అని ఆయన ప్రశ్నించారు. ఆ వెంటనే ఎన్నికల సంఘం స్పందిస్తూ సీరియల్ నంబర్ 416 లో జాబితా చేయబడిన ముసాయిదా జాబితాలో యాదవ్ పేరు ఉందని స్పష్టం చేసింది. దానితో ఆయన వద్ద రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది. తేజస్వి యాదవ్ తన ఓటరు ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) నంబర్ – ఓటరు ఐడిలపై ముద్రించిన ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ కోడ్ – ఉపయోగించి తన ఓటరు వివరాలను ధృవీకరించడానికి ప్రయత్నించాడు. కానీ ఎన్నికల కమిషన్ ఆన్లైన్ పోర్టల్ నుండి తన సమాచారాన్ని తిరిగి పొందడంలో విఫలమయ్యాడని ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికల కమిషన్ వర్గాల ప్రకారం, తేజస్వి యాదవ్ కోట్ చేస్తున్న ఎపిక్ నంబర్ చెల్లదు. ప్రాథమిక ధృవీకరణ ప్రకారం ఆయన రెండు వేర్వేరు ఓటరు ఐడి కార్డులను కలిగి ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అధికారికంగా జారీ చేయనప్పటికీ తన వద్ద ఉన్నట్లు పేర్కొన్న ఓటరు ఐడీ కార్డును దర్యాప్తు కోసం అప్పగించాలని ఎన్నికల సంఘం తేజస్వీ యాదవ్‌ను కోరింది. ఆ మేరకు పాట్నా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ త్యాగరాజ తేజస్వీ యాదవ్‌కు లేఖ రాశారు.
అందులో ఆగస్టు 2వ తేదీన విలేకరుల సమావేశంలో పేర్కొన్న ఓటర్ ఐడీ నంబర్ అధికారికంగా జారీ చేయలేదని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. కాబట్టి వివరణాత్మక దర్యాప్తునకు సహకరించాలని కోరారు. అందుకుగాను మీరు ఓటర్ గుర్తింపు కార్డును తమలు అందజేయాలని అభ్యర్థించారు.
ఓటర్ల జాబితాలోని ఎపిక్ నంబర్ గౌరవనీయ ప్రతిపక్ష నాయకుడు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తన అఫిడవిట్లో సమర్పించినది. ఆయన వద్ద మరొక నంబర్‌తో కూడిన మరొక ఎపిక్ కార్డు కూడా ఉంటే, అది దర్యాప్తు విషయమని పేర్కొన్నారు. తేజస్వి పేర్కొన్న ఎపిక్ కార్డు నంబర్ అధికారికంగా జారీ చేయలేదని స్పష్టం చేస్తూ ఈ నేపథ్యంలో ఆ ఒరిజినల్ కార్డును, దాని వివరాలను తమకు సమర్పించాలని కోరింది.
అదే సమయంలో ఎన్డీయే నాయకులు అజయ్ అలోక్, నీరజ్ కుమార్, రాజేష్ భట్ తేజస్వీ యాదవ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యాదవ్ రెండు ఎపిక్ కార్డులు కలిగి ఉండడం వల్ల ఆయనపై కేసు నమోదు చేయాలని, అది అనుమతించే విషయం కాదని తెలిపారు. తేజస్వి చేసిన మోసం, ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తున్న అణుబాంబు అవునా? కాదా? అని ఆయన కూటమి భాగస్వామి అయిన రాహుల్ గాంధీని అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఇండియా కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నిర్దిష్ట ఓటమిని చూస్తోందని స్పష్టం చేశారు. మరోవైపు, బిహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లను చేర్చాలని లేదా తొలగించాలని ఇప్పటివరకు ఏ పార్టీ డిమాండ్ చేయలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఆగస్టు 1న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆగస్టు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల మధ్య, క్లెయిమ్‌లు, అభ్యంతరాల కింద ఎటువంటి డిమాండ్ అందలేదని వెల్లడించింది. కానీ వ్యక్తిగతంగా, పేర్లను చేర్చడానికి లేదా అనర్హులు అని పేర్కొన్న వారి తొలగింపు కోసం ఓటర్ల నుంచే 941 క్లెయిమ్‌లు, అభ్యంతరాలు అందాయని చెప్పింది.
More Stories
బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన
అమెరికా చెప్పినట్లు టారిఫ్ విధిస్తే ప్రతిచర్యలు
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800