రాష్ట్రపతితో గంటల వ్యవధిలో మోదీ, అమిత్ షా భేటీ

రాష్ట్రపతితో గంటల వ్యవధిలో మోదీ, అమిత్ షా భేటీ
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గంటల వ్యవధిలోఆదివారం భేటీ కావడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది. వీరి వరుస భేటీల వెనక కారణాలు తెలియనప్పటికీ గంటల వ్యవధిలోనే ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన కేంద్ర మంత్రి అమిత్ షా, ద్రౌపదీ ముర్ముతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఫొటోను కూడా షేర్ చేశాయి.  అంతకుముందు మధ్యాహ్న సమయంలో ప్రధాని మోదీ కూడా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఆ విషయాన్ని కూడా రాష్ట్రపతి వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతితో ప్రధానమంత్రి, హోంమంత్రి సమావేశాల వెనుక గల కారణాలు తెలియరాలేదు. ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవులకు వెళ్లిన తర్వాత ప్రధానితో రాష్ట్రపతి సమావేశం ఇది మొదటిది. 

ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. జులై 21న మొదలైన సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఇటీవలే ఆపరేషన్‌ సిందూర్‌పై ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది.

అలాగే, గతవారం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించాలని లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభ ఇంకా ఈ ప్రతిపాదనను చర్చకు తీసుకోలేదు. ఫిబ్రవరి 13న ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మరోవైపు, భారత్ నుంచి ఎగుమతులపై 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి సైనిక పరికరాలు, చమురు కొనుగోలు కారణంగా జరిమానా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత కూడా ప్రధాని రాష్ట్రపతితో సమావేశం జరిగింది.

జూలై 21న జగదీప్ ధన్​ఖడ్​ ఆరోగ్య కారణాలను పేర్కొంటూ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దాదాపు రెండు వారాల తర్వాత కూడా ఇదే జరిగిన సమావేశం. ఉపాధ్యక్షుడి ఎన్నిక సెప్టెంబర్ 9న జరుగుతుందని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. ఉపాధ్యక్ష ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులతోపాటు లోక్‌సభ సభ్యులందరూ ఉంటారు.

రాష్ట్రపతితో వీరిద్దరి సమావేశాల వివరాలను రాష్ట్రపతి భవన్‌ కార్యాలయమే పేర్కొనడం విశేషం. ‘కేంద్ర గృహ వ్యవహరాలు, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు’ అని మాత్రమే రాష్ట్రపతి భవన్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పేర్కొంది. అయితే పెహల్గాం ఉగ్రవాది దాడి, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన వంటి అంశాలు వీరి భేటీకి కారణాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.